– ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ జి.రాజ్యలక్ష్మి
కడప సెవెన్‌రోడ్స్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని నిరుద్యోగ ఎస్సీ యువతకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ జి.రాజ్యలక్ష్మి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లోని సభా భవన్‌లో నిర్వహించిన యువ పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లేష్, అనిత దీప్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న రాయితీ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం ఎదురు చూసే యువత స్వయం ఉపాధి వైపు దృష్టి సారించి పరిశ్రమల స్థాపన, వ్యాపార రంగాలలో రాణించగలిగితే మరి కొంతమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించగలరన్నారు. పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ చాంద్ బాషా మాట్లాడుతూ రుణాలు తీసుకున్న లబ్ధిదారులు తిరిగి సకాలంలో చెల్లించాలన్నారు. రుణాలు సకాలంలో చెల్లిస్తే మరి కొంతమందికి రుణాలు ఇస్తామన్నారు. ఎల్డీఎం జనార్దన్ మాట్లాడుతూ పరిశ్రమల శాఖ ద్వారా చిన్న, మధ్యతరగతి పరిశ్రమల స్థాపన కోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు రాయితీ అందిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ బ్యాంక్ ఆర్‌ఎం తులసి, హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ సతీష్, డీపీఎం ఎల్‌హెచ్ రఘునాథరెడ్డి, ఎఫ్‌ఎల్‌సీ వీరప్రసాద్ , సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎస్సీ మహిళలు పాల్గొన్నారు.
మన కోసం ప్రకృతిని కాపాడుకుందాం
– కడప డీఎఫ్‌ఓ వినీత్‌కుమార్
ప్రొద్దుటూరు క్రైం : మన కోసం, భావి తరాల కోసం ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కడప డీఎఫ్‌ఓ వినీత్‌కుమార్ తెలిపారు. స్థానిక ఎర్రగుంట్ల రోడ్డులోని రాజీవ్‌గాంధీ నేషనల్ పార్కులో బుధవారం కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరులోని వివిధ పాఠశాలల విద్యార్థులు, ఎన్జీఓలు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అటవీశాఖ అధికారులు వివిధ రకాల వృక్షాలు, వాటి ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం కడప డీఎఫ్‌ఓ మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణానికి దగ్గరగా అటవీప్రాంతం ఉండటం ఎంతో అదృష్టమన్నారు. ఈ అడవిలో ఉసిరి, కానుగ, మారెడు తదితర వృక్షజాతులు ఉన్నాయని చెప్పారు. ప్రొద్దుటూరు ఎఫ్‌ఆర్‌ఓ హేమాంజలి మాట్లాడుతూ ఎప్పుడూ బిజీ జీవితాన్ని గడుపుతున్న ప్రజలు ఏడాదికి ఒకసారి కుటుంబ సభ్యులతో అటవీ ప్రాంతానికి వచ్చి వందలాది వృక్ష జాతుల మధ్య గడపడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు.ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు. అనంతరం డీఎఫ్‌ఓ వినీత్‌కుమార్ విద్యార్థులతో కలసి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో స్క్వాడ్ ఎఫ్‌ఆర్‌ఓ రామ్లా నాయక్, ఎంపీడీఓ, డీఆర్‌ఓ లక్ష్మీకుమారి, ఎఫ్‌బీఓ హరినాథరాజు, శ్రీ చైతన్య విద్యాసంస్థల ఏజీఎం నాగిరెడ్డి, భాష్యం, ఢిల్లీ పబ్లిక్‌స్కూల్, శ్రీ చైతన్య హైస్కూల్, పోట్లదుర్తి జెడ్పీహైస్కూల్ విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగార్జున, ప్రొద్దుటూరు ఎంపీడీఓ సూర్యనారాయణరెడ్డి వనిపెంట, ముద్దనూరు అటవీ శాఖ సిబ్బంది, వన సంరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు.
నిరుద్యోగ ఎస్సీ యువత అవకాశాలు అందిపుచ్చుకోవాలి


