జిల్లా సర్వజన ఆసుపత్రిని అభివృద్ధి పథంలో నడిపించాలి
కడప అర్బన్ : జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న జిల్లా సర్వజన ఆసుపత్రి (జిజిహెచ్)ని.. మరింత అభివృద్దిపథంలో నడిపించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని హెచ్‌డీఎస్. చైర్మన్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సభ్యులను ఆదేశించారు. బుధవారం రిమ్స్ ప్రభుత్వ వైద్యకళాశాల బోర్డు మీటింగ్ హాలులో జిల్లా కలెక్టర్, జీజీహెచ్ హెచ్‌డీఎస్ చైర్మన్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన 51వ ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ తోపాటు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, కడప నగర కమిషనర్ మనోజ్ రెడ్డి, డీఎంహెచ్‌ఓ డా.కె.నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ప్రజా స్పందనలో కడప జీజీహెచ్ ప్రతిభ కనపరిచినందుకు డాక్టర్లను అభినందించారు. జిజిహెచ్ లో అన్ని విభాగాల్లో డాక్టర్లు ఉన్నారని, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలన్నారు.అలాగే క్రింది స్థాయి సిబ్బంది రోగుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. అనంతరం జిజిహెచ్ లోని అన్ని విభాగాల వైద్యాధిపతులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఆయా విభాగాల్లో అవసరమైన వసతులు, సదుపాయాలు, వైద్య పరికరాలు, వైద్య సిబ్బంది తదితర అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అజెండా మేరకు..చర్చించిన అనంతరం జీజీహెచ్‌లో అవసరమైన వైద్య పరికరాల కోసం రూ. 3.5 కోట్ల విలువైన పరికరాలను కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం జరిగిందన్నారు. ఇప్పటికే.. పురోగతిలో ఉన్న పలు అభివద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముందుగా జీజీహెచ్ సూపరింటెండెంట్ రిమ్స్ హాస్పిటల్ ప్రోగ్రెస్‌పై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్ కు వివరించారు.50వ హెచ్‌డీఎస్ మీటింగ్ లో తీసుకున్న యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ను వివరించారు.ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కెఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు, రిమ్స్ ఎస్డీసీ రంగస్వామి, జీజీహెచ్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ జమున,సీఎస్ ఆర్‌ఎంఓ వై. శ్రీనివాసులు, ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఇఇ ఎ. వెంకటేశ్వర రెడ్డి, ఏపీ వీవీపీ డీసీహెచ్‌ఎస్ వై. హిమదేవి, నర్సింగ్ సూపరింటెండెంట్ వెంకట రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి


