రైతులను నట్టేట ముంచిన సచివాలయ ఉద్యోగి
సింహాద్రిపురం : రెండు రోజుల క్రితం రూ.6.25 లక్షల పింఛన్ డబ్బులతో పరారైన మండలంలోని అంకాలమ్మ గూడూరు సచివాలయం వీహెచ్‌ఏ ఎం.ప్రవీణ్ కుమార్ రెడ్డి అవినీతి బాగోతం ఒక్కొక్కటి వెలుగు చూస్తోంది. సబ్సిడీ శనగల కోసం 126 మంది రైతుల వద్ద దాదాపు రూ.8 లక్షల డబ్బులను శనగ విత్తనాల రిజిస్ట్రేషన్ కోసం తీసుకున్నాడు. అలాగే ఎరువుల కింద రైతుల వద్ద దాదాపు రూ.5 లక్షలకుపైబడిన నగదు తీసుకున్నాడు. కేవలం తెల్ల పేపర్ మీద రాసి ఇచ్చాడు. అంతేకాకుండా సహోద్యోగులు, రైతుల వద్ద అప్పుగా రూ.10 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. దీనిపై సోమవారం రైతులు అతనిపై కేసు నమోదు చేయాలని వెళ్లగా.. సంబంధిత అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అతన్ని త్వరలోనే పట్టుకుంటామని ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు. సొంతూరులో పోలీసు బృందాలు తనిఖీ చేసి అతని బైకును తెచ్చామన్నారు. దీంతో రైతులు దిక్కుతోచక అయోమయంలో పడ్డారు. కానీ రెండు రోజుల్లో తమకు న్యాయం చేసి డబ్బులు ఇప్పించకపోతే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.
ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
– జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 223 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్‌లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు,, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ ఇ.బాలస్వామి రెడ్డి, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం పాల్గొన్నారు.
మేనిఫెస్టో ఘనం అమలు శూన్యం
– వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి
వీరపునాయునిపల్లె : కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టో ఘనంగా ఉందని, అయితే ఆచరణలో మాత్రం శూన్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. సోమవారం మండలంలోని యన్.పాలగిరి గ్రామంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో కోటి సంతకాల సేకరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబునాయుడు సామాన్య ప్రజలు మొదలుకుని రైతులు, ఉద్యోగులను వంచనకు గురి చేస్తున్నారన్నారు. కరోనా సమయంలో రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు మూసేసినా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించి దేశంలో మరణాల శాతం తక్కువగా నమోదు చేశామన్నారు. మళ్లీ అలాంటి సంఘటనలు జరిగితే ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. అలాంటి మెడికల్ కళాశాలలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రైవేటు పరం చేయడానికి సిద్ధపడటం దారుణమన్నారు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో కమలాపురం మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి నియోజకవర్గ బీసీ నాయకుడు శివయాదవ్, నాయకులు నాగమునిరెడ్డి, చెండ్రాయుడు, గురివిరెడ్డి, జంగంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జనార్దన్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
రైతులను నట్టేట ముంచిన సచివాలయ ఉద్యోగి


