కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు అర్జీదారులు సంతప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు పెండింగ్ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కారం అందించాలన్నారు. ఎవరైనా అర్జిలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. వివిధ శాఖల జిల్లా అధికారులతో పీజిఆర్‌ఎస్ పెండింగ్ అర్జీల పై సమీక్ష చేశారు.
కిచెన్ షెడ్స్ నిర్వహణలోకి రావాలి: జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలైన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి డిసెంబర్ నాటికి అన్ని మండలాల్లో అమలులోకి తీసుకురావాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో.. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో యూనిక్ గా ఏర్పాటు కానున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ భవన నిర్మాణాల పురోగతిపై అన్ని డివిజన్ల ఆర్డీవోలు, సంబంధిత అధికారులతో వీసీ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు చేపట్టామని..ఇవి రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. ఇదే స్పూర్తితోనే జిల్లాలో మరో 33 స్మార్ట్ కిచెన్ షెడ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. డీఇఓ శంషుద్దిన్, స్మార్ట్ కిచెన్ల పర్యవేక్షకులు జోయల్ విజయకుమార్, హౌసింగ్ పీడి రాజరత్నం తదితరులు పాల్గొన్నారు.


