హత్య కేసులో నిందితుడి అరెస్టు
కమలాపురం : ఆస్తి తగాదాలో సొంత తమ్ముడినే హత్య చేసిన అన్న మూల చెన్నారెడ్డిని అరెస్ట్ చేసినట్లు కమలాపురం సీఐ ఎస్‌కే రోషన్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఎస్‌ఐ విద్యా సాగర్‌తో కలసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని అప్పారావు పల్లెకు చెందిన మూల చెన్నారెడ్డి, మూల విశ్వనాథ రెడ్డి సొంత అన్నదమ్ములు. అన్న అయిన చెన్నారెడ్డికి వివాహం కాలేదు. తమ్ముడి ఇంట్లోనే ఉంటూ జీవనం సాగిస్తూ మద్యం తదితర చెడు వ్యసనాలను లోనై తరచూ గ్రామస్తులతో, తన ఇంట్లో వారితో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో విశ్వనాథ రెడ్డి తన భాగానికి వచ్చిన వ్యవసాయ పొలాన్ని అమ్ముకోగా వచ్చిన డబ్బులో తనకు కూడా వాటా ఇవ్వాలని చెన్నారెడ్డి అడిగాడు. దీనికి విశ్వనాథ రెడ్డి ఒప్పుకోక పోవడంతో తమ్ముడిపై కక్ష పెంచుకున్న అన్న అతడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. గత నెల 30వ తేదీ విశ్వనాథ్ రెడ్డి ఇంటి నుంచి బైక్ పై బయటకు వెళ్తుండగా అప్పటికే సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ మూల ఎల్లారెడ్డి మిద్దె పైకి ఎక్కి ఉన్న చెన్నారెడ్డి ఆ ఇంటి పై ఉన్న మాంసం కొట్టే మొద్దుతో బలంగా కొట్టడం వలన విశ్వనాథ రెడ్డి తలకు రక్తగాయం అయి మృతి చెందాడని వివరించారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం కమలాపురం–ఎర్రగుంట్ల రహదారిలోని సి.గోపులాపురం క్రాస్ వద్ద ఉన్న చెన్నారెడ్డిని అరెస్ట్ చేశామన్నారు. అతన్ని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ వివరించారు.


