సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం
కడప సిటీ : జమ్మలమడుగు ప్రాంతంలో ఉన్న దాల్మియా సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం తమ సమస్యలను పరిష్కరించకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని దుగ్గనపల్లె, నవాబుపేట గ్రామస్తులు హెచ్చరించారు. సోమవారం కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో వైఎస్సార్ సీపీ వింగ్ వలంటీర్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్.భాస్కర్‌రెడ్డి, మైలవరం జెడ్పీటీసీ మహలక్ష్మి, తలమంచిపట్నం ఎంపీటీసీ నాగ ఉదయిని, దుగ్గనపల్లెకు చెందిన వినోద్, గ్రామస్తులతో కలిసి ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాల్మియా సిమెంట్ పరిశ్రమ వల్ల ఆరోగ్య సమస్యలు, పంటల దిగుబడి, గృహాల వల్ల ఎంతో నష్టపోతున్నామన్నారు. ఉన్న ప్లాంట్‌తోనే ఇబ్బందులు పడుతుంటే మా శవాల మీద రెండో ప్లాంట్ ఏర్పాటు చేస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ముందుకు వెళ్లడం దాల్మియా యాజమాన్యానికి సరికాదన్నారు. వరద నీరు గ్రామాలను ముంచేస్తోందన్నారు. నవాబుపేట నీటి మునిగి పొలాలు దెబ్బతిన్నాయన్నారు. ఇరిగేషన్ అధికారులు నివేదికలు ఇచ్చినా పక్కన పెట్టారన్నారు. ఈ విషయాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దృష్టికి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా దాల్మియా ఫ్యాక్టరీలోకి వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలించారన్నారు. తమ సమస్యలపై కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తీసుకెళ్లారని చెప్పారు. దాల్మియా సిమెంట్ పరిశ్రమ విస్తరణ కోసం స్థల సేకరణ చేస్తున్నారన్నారు. నవాబుపేట వద్ద వరద రాకుండా కెనాల్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు. రూ. 120 కోట్లు ఖర్చవుతుందని ఇరిగేషన్ అధికారులు చెప్పారన్నారు. పేలుళ్ల వద్ద ఇళ్లు నెర్రెలు బారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యం వల్ల పంటల దిగుబడి రాలేదని, అలాంటి భూములకు పరిహారం అందిస్తామని అదికారులు హామీ ఇచ్చారన్నారు. సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని యాజమాన్యం ఒప్పుకున్నట్లు కలెక్టర్ చెప్పినా అది కార్యరూపం దాల్చలేదన్నారు. వచ్చే కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు తీవ్రతరం అయ్యాయన్నారు. దీనికి కూడా పరిష్కారం చూపిస్తామన్నారు. బ్లాస్టింగ్ జరగకుండా చర్యలు చేపడతామన్నారు. రెండోప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజల గొంతు కోయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వం లేకుండా దాల్మియా వ్యవహరిస్తుంటే అధికారులు వత్తాసు పలకడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. గాంఽధీ మార్గంలో కాకుండా గాడ్సే మార్గంలో విస్తరణ పనులను అడ్డుకుంటామన్నారు. మా సమస్యలు పరిష్కరించకపోతే ప్రాణ త్యాగానికై నా సిద్ధమని హెచ్చరించారు.
జమ్మలమడుగు దాల్మియా సిమెంట్స్
పరిశ్రమ బాధిత గ్రామస్తులు


