ప్రభుత్వ వైద్య విద్య పేద విద్యార్థులకు అందని ద్రాక్ష
ప్రొద్దుటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రభావం కారణంగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష పండులా మారిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. స్థానిక శ్రీవిద్య జూనియర్ కళాశాలలో సోమవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వ హయాంలో పేద, మధ్యతరగతి విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఒకే మారు 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను మంజూరు చేయించి నిర్మాణ పనులు చేపట్టారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే వీటిని ప్రైవేట్‌పరం చేసిందని తెలిపారు. మంచి సంకల్పంతో జగన్ చేపట్టిన కార్యక్రమాన్ని చంద్రబాబు రద్దు చేశారన్నారు. ప్రతి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పేదలకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తారన్నారు. పైసా ఖర్చు లేకుండా వైద్యం పొందాల్సిన పేదలు ప్రైవేట్ పరం కారణంగా డబ్బు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విద్యకు జగనన్న పెద్దపీట వేశారని, ఇందులో భాగంగానే మన బడి నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన ఘనత తమదేనన్నారు. వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గుర్రం లావణ్య, జయంతి, ప్రొద్దుటూరు కోఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షురాలు గజ్జల కళావతి, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షురాలు చింతల దానమ్మ, పార్టీ నాయకులు వెలవలి రాజశేఖర్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, రమణమ్మ, దావూద్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి


