కడప రిమ్స్‌లో ఇష్టారాజ్యం.!
కడప రిమ్స్ అధికారుల వివరణ...
కడప అర్బన్ : కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో శానిటేషన్ కాంట్రాక్ట్ పనివిధానం ‘ఇష్టారాజ్యం’గా తయారైంది. గతనెల 1వ తేదీ నుంచి తిరుపతికి చెందిన ‘పద్మావతి శానిటేషన్ వర్క్స్’వారు శానిటేషన్ కార్మికుల నియామకం, పనితీరు కోసం కాంట్రాక్ట్ చేసుకునేందుకు అనుమతులు లభించాయి. వారు 15 రోజుల తరువాత ఎంఓయు ప్రక్రియను కడప రిమ్స్‌లో ప్రారంభించారు. రిమ్స్ ఆవరణంలో మొత్తం ఏడు క్యాంపస్‌లు ఉన్నాయి. వాటిలో కడప జీజీహెచ్‌లో ఐపీ, ఓపీతోపాటు, ప్రభుత్వ వైద్యకళాశాల, నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ దంత వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మానసిక వైద్యశాల, కేన్సర్ హాస్పిటల్ వారితో ఎంఓయు కుదుర్చుకోవాలి. వీటిలో ఎంఓయు ప్రక్రియను కొన్నింటిని పూర్తి చేశారు. కొన్నింటి ఫైల్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఈ విధానం ముగియకముందే నూతన శానిటేషన్ కాంట్రాక్టర్ తరపున నియమించిన ప్రతినిధులు తమ సంస్థ నిబంధనల మేరకు సూపర్‌వైజర్‌లను, శానిటేషన్ కార్మికులను నియమించుకుని పనులను చేయిస్తామని ప్రారంభించారు. ఈ క్రమంలో రిమ్స్ ఆవరణంలో గత 18 సంవత్సరాలుగా సూపర్‌వైజర్‌లుగా పనిచేస్తున్న వారిలో డిగ్రీ ఉత్తీర్ణత లేని వారిని నిలుపుదల చేసేందుకు వారిని సర్టిఫికెట్స్ తీసుకుని రమ్మని పట్టుబట్టారు. అలాగే కార్మికులలో మహిళలుగానీ, పురుషులుగానీ 50 సంవత్సరాలు పైబడిన వారిని కూడా తొలగించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో శానిటేషన్ సూపర్‌వైజర్లు, కార్మికుల తొలగింపు ప్రక్రియకు వ్యతిరేకంగా తమను అకస్మాత్తుగా ఎందుకు తొలగిస్తారని మూడు రోజుల క్రితం సీఐటీయూ, ఆర్‌సీపీ యూనియన్‌ల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. యూనియన్ నాయకులు మాత్రం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న శానిటేషన్ సూపర్‌వైజర్‌లను, కార్మికులను తొలగిస్తే ఉద్యమిస్తామని నూతన శానిటేషన్ కాంట్రాక్ట్ నిర్వాహకులను హెచ్చరించారు. కాంట్రాక్ట్ నిబంధనలు ఏవైనా వుంటే కొత్తగా ఎవరినైనా నియమించుకునేందుకు వర్తింప చేయాలనీ, కానీ గత 18 ఏళ్లుగా పనిచేస్తున్న వారిపై తాజా నిబంధనలను రుద్దడం సరికాదని తేల్చి చెప్పారు. మరోవైపు పాత వారిని తీసివేస్తామనే ఉద్దేశంతో గత నెల రోజుల నుంచి కొందరు సూపర్‌వైజర్‌లను, శానిటేషన్ కార్మికులను హుటాహుటిన నియమించుకుని నెలరోజులపాటు కొందరితో, పదిరోజుల నుంచి 15 రోజులపాటు కొందరితో పనిచేయించుకున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి వారిలో కొందరిని రావొద్దని కొత్త సూపర్‌వైజర్‌లను, కార్మికులను శానిటేషన్ కాంట్రాక్టర్ తరపున వున్న ప్రతినిధులు తేల్చిచెప్పారు. దీంతో నెలరోజులకే తొలగింగింపునకు గురైన సూపర్‌వైజర్లు, కార్మికులు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను నిలదీయగా మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలుంటేనే తాము నియమించుకునేందుకు అంగీకరిస్తామని తమ యజమాని చెప్పారని వారు పేర్కొన్నారు. దీంతో ఐపీ విభాగంలోని కార్యాలయం వద్ద బాధిత కార్మికులు ఆందోళన చేపట్టారు.
శానిటేషన్ కార్మికులు, సూపర్‌వైజర్ల నియామకంలో గందరగోళం
అడ్డగోలు నియామకాలతో తలనొప్పిగా మారిన వ్యవహారం
మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు ఉంటేనే నియమించుకుంటామంటున్న కాంట్రాక్టు సంస్థ
నెల రోజులు పని చేసిన తర్వాత ఇదేమి విడ్డూరమని కార్మికుల ఆందోళన
ఈ విషయంపై రిమ్స్ అడ్మినిస్ట్రేటర్ రంగస్వామి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.ఎస్.ఎస్ వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ నూతన శానిటేషన్ కాంట్రాక్టర్‌కు, యూనియన్ నాయకులకు మధ్య త్వరలో చర్చలు నిర్వహిస్తామన్నారు. తరువాత కార్మికులకు న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు.


