డైవర్షన్ పాలిటిక్స్ బాబుకు అలవాటే
పులివెందుల: డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు అలవాటేనని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలోని తన స్వగృహం వద్ద ఆయన మాట్లాడారు. చంద్రబాబునాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ఉంటాడని ధ్వజమెత్తారు. ఆయనకు అనుకూలంగా ఉన్న ఎల్లోమీడియా కూడా జరిగిన తప్పిదాన్ని కప్పి ఉంచి చంద్రబాబు అజెండానే తమ అజెండాగా భావించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన, మొంథా తుఫాన్ కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టి మరల్చేందుకు తమ పార్టీ నాయకుడు జోగి రమేష్ అరెస్టును తెరపైకి తీసుకొచ్చారన్నారు. అసలు నకిలీ మద్యం కేసులో నిందితులంతా తెలుగుదేశం పార్టీకి చెందినవారేనని రాష్ట్ర ప్రజలందరికి తెలిసిన విషయమేనన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ఎలాంటి తప్పులు జరిగినా వెంటనే ఏదో ఒక అబద్దపు నిందలతో వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్టు చేయడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి తమ పాలనపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలతో మమేకమయ్యారు.
టీం ఇండియాకు అభినందనలు: ప్రపంచకప్ మహిళా క్రికెట్ పోటీలలో ఇండియన్ మహిళల క్రికెట్ జట్టు విజయం సాధించడంపై ఎంపీ అవినాష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జట్టులోని ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. విజేత జట్టులో జిల్లా వాసి శ్రీచరణి పాలు పంచుకోవడం జిల్లాకే గర్వకారణమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. శ్రీచరణి దేశానికేకాక రాష్ట్రానికి, తద్వారా మన జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిందని కొనియాడారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


