భక్తుల ప్రాణాలకు భద్రతేదీ!
కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో భక్తుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని కాశీబుగ్గ ఘటనపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా పరిశీలకులు కె. సురేష్ బాబుతో కలిసి ఆదివారం సాయంత్రం నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పొట్టిశ్రీరాములు సర్కిల్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని అసత్య ప్రచారానికి ఒడిగట్టి అపచారం చేశారన్నారు. ఈ 18 నెలల్లో ఎంతోమంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు, సింహాచలంలో గోడ కూలి ఏడుగురు మృత్యువాతపడ్డారని, తాజాగా కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది చనిపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజల భద్రతకు, రక్షణకు వినియోగించాల్సిన పోలీసులను వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించేందుకు, వేధించేందుకు వినియోగించడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని మండిపడ్డారు. అది ప్రైవేటు ఆలయమని చెప్పి ప్రభుత్వం తప్పించుకోవాలని చూడటం సరైంది కాదన్నారు. పోలీసులకు ఒక రోజు ముందే సమాచారం ఇచ్చామని ఆలయ నిర్వాహకులు చెప్పారని, ఆ వెనువెంటనే వారిచేతనే మాట మార్పించారన్నారు. కూటమి ప్రభు త్వంలో ఒక భక్తులకే కాదు మహిళలకు, చిన్నపిల్లలకు ఎవరికీ రక్షణ లేదన్నారు. రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు, అకృత్యాలు జరుగుతుంటే పోలీసు శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, గాయపడిన 25 మందికి రూ.10లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన నుంచి డైవర్షన్ చేసేందుకే మాజీ మంత్రి జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆయన ప్రమాణం చేసి నార్కో అనాలసిస్ టెస్టుకు కూడా సిద్ధ్దమని ప్రకటించినా టీడీపీ నేతలు స్పందించలేదని గుర్తు చేశారు. ఈ అరాచకాలు ఎంతో కాలం సాగవని, ఇలాగే ఉంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యులు యానాదయ్య, డా. సొహైల్, జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్, జిల్లా అధ్యక్షుడు ఎస్. వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు దాసరి శివప్రసాద్, జమాల్‌వలీ, బంగారు నాగయ్య, సీహెచ్ వినోద్, సుభాన్ బాష, షఫీ, షఫీవుల్లా, పవర్ అల్తాఫ్, శివకోటిరెడ్డి, షంషీర్, త్యాగరాజు, కంచుపాటి బాబు, పస్తం అంజి, పి. సంపత్, అరీఫుల్లాబాష, టీపీ వెంకట సుబ్బమ్మ, బి. మరియలు, ఉమామహేశ్వరి, నారాయణమ్మ, సుజిత, సుశీలమ్మ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
మృతులకు రూ.25లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి
కొవ్వొత్తుల ప్రదర్శనలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా,అన్నమయ్య జిల్లా పరిశీలకులు కె. సురేష్ బాబు


