రాఘవేంద్ర ‘దక్షత’కు పురస్కారం
రాయచోటి టౌన్: ఒడిశా రాష్ట్రం ఝార్సుగూడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (SP) గుండాల రెడ్డి రాఘవేంద్రను ప్రతిష్టాత్మక ‘దక్షత’ అవార్డు వరించింది.రాయచోటికి చెందిన ఈయన 2019 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఒడిశా–చత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్లల్లో రాఘవేంద్ర కీలకంగా వ్యవహరించారు. ఈయన దక్షతకు పురస్కారం లభించింది.నకృల్స్ ప్రభావిత ప్రాంతాల్లో చురుగ్గా పనిచేసినందుకు గతంలో ఒడిశా ప్రభుత్వం నుంచి డీజీపీ డిస్క్ పురస్కారం పొందారు
ఓబులవారిపల్లె: రేణిగుంట–నంద్యాల డెమో ప్యాసెంజర్ రైలుకు బ్రేక్ సిస్టం సమస్య తలెత్తడంతో ఆదివారం ఓబులవారిపల్లి రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. మధ్యాహ్నం 1.45 గంటలకు రేణిగుంటలో బయలుదేరాల్సిన రైలు ఇంజిన్‌లో సమస్య రావడంతో మధ్యాహ్నం మూడున్నరకు మరో ఇంజిన్‌ను జోడించి పంపించారు. ప్రతి స్టేషన్‌లో ఆగిపోయేది. రైల్వే మెకానిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినా మరమ్మతు చేయలేకపోయారు. రాత్రి 9 గంటలకు ఓబులవారిపల్లి రైల్వేస్టేషన్‌కు రాగానే బ్రేకుల్లో సమస్య తలెత్తడంతో రైలును నిలిపివేశారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా రైల్వేశాఖ అధికారులు తిరుపతి–గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైలుకు ఓబులవారిపల్లిలో స్టాపింగ్ కల్పించి వారిని పంపించారు.
కడప రూరల్: క్రైస్తవులలోని క్యాథలిక్‌లు ప్రతి సంవత్సరం నవంబరు రెండో తేదీని ‘సకల ఆత్మల పండుగ’గా పాటిస్తారు. తమ కుటుంబాలలో మరణించిన వ్యక్తుల ఆత్మ శాంతి కోసం ఆ రోజు పూజలు నిర్వహిస్తారు. తమ ఆత్మీయుల సమాధుల దగ్గరకు వెళ్లి, వాళ్లకు దైవానుగ్రహం లభించాలని, మోక్షాన్ని పొందాలని కోరుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అల్ సోల్స్ డే సందర్భంగా ఆదివారం ప్రపంచ ఆత్మల స్మరణ దినోత్సవం నిర్వహించారు. కడప కొత్త రిమ్స్ వద్ద గల సమాధుల తోట, మాసాపేటలోని దొరల గోరీల వద్ద క్రైస్తవులు మృతి చెందిన తమ కుటుంబ సభ్యుల సమాధులను పూలతో అలంకరించారు. కొవ్వొత్తులను వెలిగించి ప్రార్థనల ద్వారా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రెవరెండ్ డాక్టర్ బిషప్ శామ్యూల్ బాబు తోపాటు బిషప్, పాస్టర్ల ద్వారా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. కార్యక్రమంలో పాస్టర్ దానం పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
