వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై టీడీపీ గూండాల దాడి
వేంపల్లె : వేంపల్లె మండలంలోని అలిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త (జగనన్న మిషన్ అడ్వైజర్) కుంచం రాఘవరెడ్డిపై టీడీపీ గుండాలు దాడికి దిగారు. ఆదివారం స్థానిక కడప రోడ్డులోని హనుమాన్ జంక్షన్ వద్ద రాఘవరెడ్డిపై తువ్వపల్లె గ్రామానికి చెందిన గోపీనాథ్ రెడ్డి తోపాటు మరో 30 మంది కట్టెలు, రాడ్లతో దాడి చేశారు. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. నెల రోజులుగా ఫేస్‌బుక్‌లో గోపీనాథ్ రెడ్డి రెచ్చిపోయే విధంగా పోస్టులు పెడుతున్నాడు. ఇది మంచి పద్ధతి కాదని పలుమార్లు హెచ్చరించినా.. నీ అంతు చూస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో రాఘవరెడ్డి హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న స్వగృహానికి వెళుతుండగా కాపు కాచి రాడ్లతో తల, వీపుపై కొట్టి గాయపరిచారు. స్థానికులు అక్కడికి చేరుకోవడంతో వారు పారిపోయారు. గాయపడిన రాఘవరెడ్డిని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


