రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కడప అర్బన్ : కడప నగరం ఫాతిమా మెడికల్ కళాశాల సమీపంలో ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చెన్నూరుకు చెందిన ఎం.సూర్యచంద్ర అలియాస్ సూరి (28) సొంత పని నిమిత్తం ద్విచక్ర వాహనంలో పులివెందుల దారి వెళ్లి తిరిగి వస్తుండగా వేగం అదుపు చేయలేక డివైడర్‌ను ఢీకొన్నాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కడప ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
విద్యుత్ తీగలు తెగి
రెండు గేదెలు మృతి
కొండాపురం : విద్యుత్ లైన్ కింద పశువులు మేత మేస్తుండగా ఉన్నట్టుండి మెయిన్ లైన్‌కు చెందిన తీగ తెగిపోవడంతో రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. స్థానికుల వివరాల మేరకు మండల పరిధిలోని బెడుదూరు గ్రామానికి చెందిన బి.డేవిడ్ పాడిపరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. గేదెలను మేపుకొనేందుకు రామిరెడ్డిపల్లె వైపు శనివారం ఉదయం వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చే సమయంలో సాయంత్రం విద్యుత్ తీగ తెగి రెండు గేదెల మీద పడటంతో అవి మృతి చెందాయి. రెండు గేదెల విలువ సుమారు రూ. 1.40 లక్షలు ఉంటుందని స్థానికులు తెలిపారు. ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు.
బాలిక అదృశ్యం
ముద్దనూరు : మండలంలోని కొత్తపల్లె గ్రామంలో బాలిక అదృశ్యమైనట్లు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. సీఐ దస్తగిరి సమాచారం మేరకు అదృశ్యమైన బాలిక పులివెందులలోని ఓ మిల్‌లో పనిచేస్తోంది. శనివారం ఉదయం మిల్‌లో పనిచేయడానికి వెళ్లింది. అయితే రాత్రివరకు తిరిగి ఇంటికి రాలేదు. బాలిక తల్లి బంధువులను, చుట్టుపక్కలవారిని విచారించినా ఆచూకీ తెలియలేదు. దీంతో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
మహిళ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : అనారోగ్యం భరించలేక మహిళ ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆదివారం పుంగనూరు మండలంలో జరిగింది. ఈడిగపల్లె పంచాయతీ కమ్మవారిపల్లెకు చెందిన సురేంద్ర భార్య రేఖ(36) గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో లేని సమయం చూసి అనారోగ్యాన్ని భరించలేక మనస్తాపంతో పురుగుమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతికి రెఫర్ చేశారు.
ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : మద్యానికి బానిసై మనస్తాపంతో ల్యాబ్ టెక్నీషియన్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. పోతబోలు పంచాయతీ సిద్ధమ్మగారిపల్లెకు చెందిన వెంకటరమణ కుమారుడు ఉపేంద్ర(30) బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తుండేవాడు. చాలాకాలంగా మద్యానికి బానిస అయ్యాడు. దీంతో పనిమానేసి స్వగ్రామానికి వచ్చి స్థానికంగా ఉన్న పనులకు వెళ్లేవాడు. అతిగా ఉన్న మద్యం అలవాటుతో అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం భార్య కృష్ణవేణిని సీటీఎం పంచాయతీ మిట్టపల్లెలోని పుట్టింటికి కేదారవ్రత నోములకు అవసరమైన వంట చేసుకుని వచ్చేందుకు పంపాడు. ఆ తర్వాత ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చిన భార్య పోలీసులకు సమాచారం అందించింది.


