ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కాశీబుగ్గ ఆలయంలో మరణాలు
ప్రొద్దుటూరు క్రైం : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో 9 మంది మహిళలు మృతి చెందారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో ఆదివారం రాచమల్లు విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయని, దాన్ని మనం ఏమీ చేయలేమని స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాడునాయుడు చెప్పడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు చంద్రబాబు ఇంట్లో జరిగితే ఈ మాటలను అంత సులభంగా చెప్పేవారా అని ప్రశ్నించారు. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ఎండోమెంట్ పరిధిలో లేదని, ఈ ఘటనతో తమకు సంబంధం లేదని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చెప్పడాన్ని అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. కాశీబుగ్గ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారనే సమాచారాన్ని ఆలయ నిర్వాహకులు ముందుగానే పోలీసులకు సమాచారం అందించారన్నారు. అయినా పోలీసులు పట్టించుకోలేదంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో స్పష్టం అవుతోందని చెప్పారు.
ఆరోగ్యశ్రీ బంద్ చేసి
పేషెంట్లను చంపుతున్నారు..
చంద్రబాబు ఆరోగ్యశ్రీ పథకాన్ని బంద్ చేసి పేషెంట్లను చంపితే.. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసి రైతులను బతికుండగానే చంపేశారని రాచమల్లు అన్నారు. అలాగే ఫ్రీ బస్సు పథకాన్ని పెట్టి మహిళలను చంపుతారు.. నకిలీ మద్యంతో పురుషుల ప్రాణాలను తీస్తున్నారని ధ్వజమెత్తారు. కాశీబుగ్గ ఆలయం ఘటన జరిగిన తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సహాయక చర్యలు చేపట్టేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అనుమతించలేదన్నారు. మోంథా తుపానును అడ్డుకున్నానని బాబు గొప్పలు చెప్పడం సిగ్గు చేటన్నారు. మోంథా తుపానును ఆపగలిగిన చంద్రబాబు కాశీబుగ్గ ఆలయంలో భక్తుల ప్రాణాలను ఎందుకు కాపాడలేకపోయారని నిలదీశారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు, ,క్షతగాత్రులకు రూ. 10 లక్షలు అందజేసి మంచి వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు. మహిళల మరణాలకు బాధ్యత వహించి హోం మంత్రి అనిత రాజీనామా చేయాలని, సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి


