బాల్యంపై తల సీమియా పోటు
● పేదరికంతో వైద్యం
చేయించలేకున్న
తల్లిదండ్రులు
● దాతలు ఆదుకోవాలని
వేడుకోలు
మైదుకూరు : అందమైన బాల్యంలో తోటి పిల్లలతో కలసి ఆడుతూ పాడుతూ ఉండాల్సిన ఈ బాలుడు ఎప్పుడూ నీరసంగా తల తిరుగుతూ ఒక్కోసారి నొప్పితో పోటెత్తుతూ శాపగ్రస్తుడిలా ఉండాల్సి వస్తోంది. భవిష్యత్తుపై బంగారు కలలు కనాల్సిన ఈ బాలుడు అలా నిస్తేజంగా ఉండటానికి కారణం ఈ బాలుడికి తల సీమియా వ్యాధి సోకడమే. మైదుకూరులోని సర్వాయిపల్లె రోడ్డుకు చెందిన షేక్ అబ్దుల్ మత్తీన్ అనే 8 ఏళ్ల ఈ బాలుడు తల సీమియా వ్యాధితో బాధపడుతున్నాడు. పేదలైన తల్లిదండ్రులు నూర్జహాన్, అమీర్ బాషా ఈ బాలుడికి వైద్యం చేయించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైవర్‌గా పనిచేస్తున్న అమీర్ బాషా దంపతులకు ముగ్గురు పిల్లలు. తలసీమియాతో బాధపడుతున్న మత్తీన్ మూడో సంతానం. రెండేళ్ల క్రితం రక్తం ఎక్కించగా అది మెదడులోకి చేరింది. బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడ పరీక్షలు చేయించగా బాలుడికి తలసేమియా వ్యాధి వచ్చినట్టు గుర్తించారు. ఈ రెండేళ్లలో బాలుడి చికిత్స కోసం ఆస్పత్రులకు తిరుగుతూ తల్లిదండ్రులు రూ.4లక్షలు దాకా ఖర్చు చేశారు. ప్రస్తుతం కడప రిమ్స్ ఆస్పత్రిలో 15 రోజులకోమారు బాలుడికి రక్తాన్ని ఎక్కిస్తున్నారు. హైదరాబాద్‌లోని లిటిల్ స్టార్ ఆస్పత్రిలో చూపించగా పిల్లవాడికి బోన్ మ్యారోను ఎక్కించాల్సి ఉంటుందని అక్కడి వైద్యులు చెప్పారు. ఇందు కోసం రూ.15లక్షల దాకా ఖర్చవుతుందని తెలిపారు. ఆస్పత్రికి చెందిన వైద్యుడు రమణకు పరిచయం ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ వారు ఆపరేషన్‌కు రూ.10లక్షలు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయినా వీరికి ఇంకో రూ.5లక్షలు కావాల్సి ఉంది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబానికి రూ.5లక్షలు తలకు మించిన భారమే అవుతుంది. దాతలు ముందుకు వస్తే బాలుడి వ్యాధి నయమై లేత జీవితం చిగురిస్తుంది. దాతలు ఆర్థిక సహాయం అందించాలని మత్తీన్ తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు. బాలుడి చికిత్సకు ఆర్థిక సాయం అందజేసే దాతలు బాలుడి తల్లి నూర్జహాన్ బ్యాంక్ (యూనియన్ బ్యాంక్) అకౌంట్ నంబర్ 104010100200315, ఐఎఫ్‌సీ కోడ్ నంబర్ UB1 N 0810401కి పంపాలని కోరుతున్నారు.


