7.5 టన్నుల కందిపప్పు బ్లాక్ మార్కెట్‌కు ?
ప్రొద్దుటూరు : ప్రభుత్వం పేదల కోసం సరఫరా చేసిన కందిపప్పు డీలర్లు, అధికారులు కలిసి బ్లాక్ మార్కెట్‌కు తరలించారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు చౌకదుకాణాల గోడౌన్ పరిధిలో ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాలు ఉన్నాయి. మొత్తం 166 రేషన్ షాపులు ఉండగా, నిబంధనల ప్రకారం బియ్యం, చక్కెరతోపాటు కార్డుదారులకు కందిపప్పు అందించాల్సి ఉంది. ఉన్నతాధికారులు గోడౌన్‌కు ఆలస్యంగా కందిపప్పు సరఫరా చేశారు. మొత్తం రేషన్ కార్డుల్లో కేవలం 8 శాతం కార్డుదారులకు మాత్రమే కందిపప్పు ఇవ్వాలని సూచించారు. ఈ ప్రకారం ప్రొద్దుటూరు గోడౌన్‌కు 7.5 టన్నుల కందిపప్పును అధికారులు డీలర్లకు అందించారు. ఎంపిక చేసిన రేషన్ డీలర్లు తమ పలకుబడిని ఉపయోగించి కందిపప్పును తీసుకెళ్లారు. అప్పటికే బియ్యం పంపిణీ పూర్తి కావడంతో కంది పప్పు ఇచ్చినా.. ఇవ్వకపోయినా పట్టించుకోరని డీలర్లు బ్లాక్ మార్కెట్‌కు కందిపప్పు తరలించారు. కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు కందిపప్పు అందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం కందిపప్పు కేజీ రూ.67లకు విక్రయిస్తుండగా బయట మార్కెట్‌లో రూ.100పైగా పలుకుతోంది. దీంతో డీలర్లు, అధికారులు కలిసి కంది పప్పును బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై పౌరసరఫరాల శాఖ సంస్థ డిప్యూటీ తహసీల్దార్ శివప్రసాద్‌ను వివరణ కోరగా కందిపప్పు సరఫరా చేయలేదని, ఆరోపణలు వచ్చిన మాట నిజమేనన్నారు. తాను స్వయంగా ఆయా రేషన్ షాపులను పరిశీలించానని, గత నెలలో సరఫరా చేసిన కందిపప్పును డీలర్లు ఇప్పుడు పంపిణీ చేస్తున్నారన్నారు. రేషన్ షాపుల్లో యథావిధిగా కందిపప్పు బస్తాలు ఉన్నాయని తెలిపారు.


