మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు అక్రమం
కడప కార్పొరేషన్ : మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమమని వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్. శివరామ్ అన్నారు. ఆదివారం ౖజిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ కేవలం కక్ష సాధింపు చర్య మాత్రమేనని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బీసీలపై రాజకీయ దాడులు, అక్రమ కేసులు, వేధింపులు నిత్యం జరుగుతూనే ఉన్నాయన్నారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌ను దురుద్దేశపూర్వకంగా ఇరికించారన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రమాణం చేసిన జోగి రమేష్ సవాల్‌పై టీడీపీ నేతలు ఇప్పటికీ స్పందించలేదన్నారు. ఇది స్పష్టంగా రాజకీయ ప్రతీకారంతో జరిగినదేనని ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీని, జోగి రమేష్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జోగి రమేష్ సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో పిటిషనన్ దాఖలు చేశారని, అది విచారణకు రాకముందే ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రభుత్వ దురుద్దేశాన్ని బట్టబయలు చేస్తోందన్నారు. కాశిబుగ్గ ఆలయ తొక్కిసలాటలో ప్రజల ప్రాణనష్టం, మోంథా తుఫాను సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యాలను మర్చిపోయేలా డైవర్షన్ చేసేందుకే ఈ అరెస్ట్ చేసినట్లు కనిపిస్తోందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పుల శివ యాదవ్ , వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం
జిల్లా అధ్యక్షుడు ఎన్. శివరామ్


