6న గ్రామ సచివాలయాల వద్ద ఆందోళన
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : మోంథా తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పంటల బీమా పెట్టుబడి రాయితీ పరిహారం చెల్లించాలని ఈనెల 6న జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయాల వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తెలిపారు. ఆదివారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోంథా తుఫాను ప్రభావంతో చేతికొచ్చిన పంటలు చేలోనే పడిపోయాయన్నారు. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలో 13వేల ఎకరాలలో వరి, మినుము, కంది, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న, పెసర, నువ్వు, పదివేల ఎకరాల పైబడి ఉద్యాన పంటలైన ఉల్లి, మిరప, టమాటా లాంటి పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయన్నారు. గత ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం మొత్తం చెల్లిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులే ప్రీమియం చెల్లించాలన్న ఆదేశాలు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం సవాలక్ష షరతులు పెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తే సహించేది లేదన్నారు.


