ప్రొద్దుటూరులో నర్సింగ్‌ హోం సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరులో నర్సింగ్‌ హోం సీజ్‌

Nov 2 2025 9:06 AM | Updated on Nov 2 2025 9:06 AM

ప్రొద్దుటూరులో నర్సింగ్‌ హోం సీజ్‌

ప్రొద్దుటూరులో నర్సింగ్‌ హోం సీజ్‌

లింగనిర్ధారణ పరీక్షలు చేసినట్లు

ఆరోపణలు

రిజిస్ట్రేషన్‌ లేకుండానే నాలుగేళ్లుగా నర్సింగ్‌ హోం నిర్వహణ

ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని గాంఽధీరోడ్డులో ఉన్న సీఎన్‌ఆర్‌ నర్సింగ్‌హోంను వైద్య ఆరోగ్యశాఖాధికారులు సీజ్‌ చేశారు. ఆస్పత్రి వైద్యుడు ప్రతాపరెడ్డి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ గీతా, జిల్లా వైద్యాధికారుల బృందంతో కలిసి ఆస్పత్రిని సీజ్‌ చేశారు. ఆస్పత్రి వైద్యుడు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడని ఫిర్యాదులు రావడంతో గత నెల 28న డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ గీత ఆస్పత్రిని తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా ఆస్పత్రిలో ఉన్న మొబైల్‌ స్కానింగ్‌ మిషన్‌ను మరో చోటికి తరలించినట్లు గుర్తించారు. దీంతో స్కానింగ్‌మిషన్‌ను సీజ్‌ చేసి కడప డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి తరలించారు. తదుపరి చర్యల నిమిత్తమై డాక్టర్‌ ప్రతాపరెడ్డితో మాట్లాడాలని వైద్యాధికారులు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. దీంతో డిప్యూటీ డీఎంహెచ్‌ఓతో పాటు కడప నుంచి వైద్యాధికారుల బృందం శనివారం సీఎన్‌ఆర్‌ నర్సింగ్‌ హోంకు వచ్చారు. ఆస్పత్రిలోని ల్యాబ్‌ గది, డాక్టర్‌ ఓపీ గదులను సీజ్‌ చేశారు. ఆస్పత్రిలో గైనకాలజిస్టు గది ఉండగా.. ఈ వ్యవహారంలో ఆమె ప్రమేయం లేని కారణంగా సీజ్‌ చేయలేదని వైద్యాధికారులు చెబుతున్నారు.

నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ కాలేదు

లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించారనే ఆరోపణలపై ఆస్పత్రిని సీజ్‌ చేయడానికి జిల్లా వైద్యాధికారులు వచ్చిన నేపథ్యంలోఆస్పత్రికి సంబంఽధించిన ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. సీఎన్‌ఆర్‌ నర్సింగ్‌హోం రిజిస్ట్రేషన్‌ గడువు ముగిసి నాలుగేళ్లయింది. అప్పటి నుంచి ఆస్పత్రి నిర్వాహకులు రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్‌ చేసుకోలేదు. కేవలం ఫిర్యాదులు వస్తే తప్ప సంబంధిత జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారులు ఆస్పత్రుల వైపు కన్నెత్తి చూడటం లేదు. గత 28న తనిఖీ చేయడానికి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వచ్చి వెళ్లిన రెండు రోజుల తర్వాత రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ కోసం ఆస్పత్రి నిర్వాహకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.

స్కానింగ్‌ మిషన్‌ను మరో చోటికి తరలించరాదు

రిజిస్ట్రేషన్‌లో పొందు పరిచిన విధంగా కాకుండా ఒక గది నుంచి మరో గదికి స్కానింగ్‌ మిషన్‌ను మార్చినా నేరం అవుతుందని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ గీత అన్నారు. ఆస్పత్రిలోని గదులను సీజ్‌ చేసిన అనంతరం డాక్టర్‌ గీత మీడియాతో మాట్లాడారు. తమకు వచ్చిన ఫిర్యాదుల మేరకు గత నెల 28న సీఎన్‌ఆర్‌ నర్సింగ్‌హోను తనిఖీ చేశామన్నారు. ఆస్పత్రిలో ఉన్న స్కానింగ్‌ మిషన్‌ను ఒక ఆర్‌ఎంపీ క్లినిక్‌కు తరలించినట్లు తమ విచారణలో వెల్లడైందని చెప్పారు. దీంతో స్కానింగ్‌ మిషన్‌ను సీజ్‌ చేసి డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి పంపించామన్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేసినట్లు రుజువు కాలేదని, తమకు ఆధారాలు ఏమీ దొరకలేదన్నారు. కేవలం స్కానింగ్‌ మిషన్‌ను మరో చోటికి తీసికెళ్లినట్లు మాత్రమే నిర్ధారణ జరిగిందన్నారు. ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ గడువు ముగిసి నాలుగేళ్లు అయిందన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని మూడు నోటీసులు జారీ చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తెలిపారు. అయినా వారు ఖాతరు చేయలేదన్నారు. రెన్యువల్‌ కోసం రెండు రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. తదుపరి చర్యల నిమిత్తం పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు చెప్పారు. తనిఖీల్లో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ గీత, డెమో భారతి, హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement