పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జిల్లాలో మోంథా తుపాను ప్రభావంతో పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ కోరారు. శనివారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కురిసిన అధిక వర్షాలతో పత్తి, వరి, మొక్కజొన్న, శనగ, మిర్చి వంటి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. వరిపంట నేలకొరగడంతో యంత్రాలతో కోయడం సాధ్యపడక దాంతో ఖర్చుపెరిగే అవకాశం ఉందన్నారు. దిగుబడి సగానికి సగం తగ్గే అవకాశం ఉంది. దెబ్బతిన్న అన్ని పంటలకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశీలన బృందంలో అధికారులు, సిబ్బందితోపాటు రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ప్రతినిధులను భాగస్వాములను చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రామ్మోహన్, మనోహర్, అన్వేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉచితంగా కంటి పరీక్షలు
వేముల : యురేనియం పరిధిలోని గ్రామాల్లో ఉచితంగా కంటి పరీక్షలతోపాటు శస్త్ర చికిత్సలు చేసేలా పుష్పగిరి కంటి ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూసీఐఎల్ జీఎం సుమన్ సర్కార్ పేర్కొన్నారు. అందుకు సంబంధించి సీఎస్‌ఆర్ గ్రాంట్ కింద రూ.24.20 లక్షల చెక్కును పుష్పగిరి కంటి ఆసుపత్రి ప్రధాన వైద్యుడు సూర్యప్రకాష్‌కు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎస్‌ఆర్ నిధులను వైద్య పరికరాల కొనుగోలుకు కేటాయించామన్నారు. తుమ్మలపల్లె ప్రాజెక్టు పరిసర గ్రామాల్లోని పేద రోగులకు పుష్పగిరి కంటి ఆసుపత్రి ప్రతి ఏటా 5వేల కంటే ఎక్కువ కంటి శస్త్ర చికిత్సలను ఉచితంగా నిర్వహిస్తుందన్నారు. మూడేళ్లపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీజీఎం ఎస్.కె.బర్మాన్, సీఎస్‌ఆర్ ఇన్‌చార్జి నవీన్‌కుమార్‌రెడ్డి, యురేనియం అధికారులు పాల్గొన్నారు.
పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలి


