రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
వల్లూరు(చెన్నూరు) : మోంథా తుపాను కారణంగా పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి పోచిమరెడ్డి నరేన్ రామాంజులరెడ్డి విమర్శించారు. చెన్నూరు మండల పరిధిలోని గుర్రంపాడు పంచాయతీ ఓబులంపల్లెలో ఇటీవల కురిసిన వర్షాలకు నేల కొరిగి దెబ్బతిన్న వరి పంట పొలాలను శనివారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి బాధలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి మట్టి నమూనా సేకరణ నుంచి నాణ్యమైన విత్తనాలను, ఎరువులను అందించడమేకాక పంట చేతికొచ్చి పంటను సరైన ధరకు అమ్ముకునే వరకు రైతుకు అండగా నిలిచారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కనీసం ఎరువులను కూడా అందించలేక పోయిందన్నారు. ఉల్లిని కొనుగోలు చేస్తామని చెప్పి కొనుగోలు చేయలేదని, హెక్టారుకు రూ.50 వేలు పరిహారం అందిస్తామని ఇవ్వలేదని, సున్నా వడ్డీ, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులను ఎగనామం పెట్టిందని దుయ్యబట్టారు. వ్యవసాయం దండగ అనే సీఎం చంద్రబాబు ఆ మాటను నిజం చేయడానికి శాయ శక్తులా కృషి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సాధారణంగా రైతులకు ప్రకృతి వైపరీత్యాలు, చీడ ,పీడలు శత్రువులని, కానీ చంద్రబాబు నాయుడు వాటికంటే ప్రధాన శత్రువన్నారు. కమలాపురం నియోజకవర్గంలో కుందూ, పెన్నా నదీ పరివాహక ప్రాంతాల్లో వరి, పూల తోటలు, ఉల్లి, మినుము వంటి పంటలు వర్షాలకు దెబ్బతినగా ఇంత వరకు అధికారులు కనీసం వాటిని పరిశీలించక పోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యులు మాసీమ బాబు, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, కమలాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గుమ్మళ్ల సాయి కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు చల్లా వెంకటసుబ్బారెడ్డి, చల్లా శివారెడ్డి, వారిస్, హస్రత్, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
కమలాపురం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి
నరేన్ రామాంజులరెడ్డి


