బద్వేలు అర్బన్ : మోంథా తుపాను ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం బద్వేలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని గుండంరాజుపల్లెలో తుపాను కారణంగా దెబ్బతిన్న వరిపంటను సీపీఎం బృందం పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో నాలుగు రోజుల్లో కోత కోసేందుకు సిద్ధమైన వరిపంట తుఫాను ప్రభావంతో పూర్తిగా దెబ్బతిందని, దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని అన్నారు. నీటమునిగిన పంటలను అధికారులు పరిశీలించి రైతులకు ఎకరాకు రూ.35 వేలు చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. ఉచిత పంటల బీమా ఎత్తివేతల వలన దాదాపు 6 లక్షల మంది రైతులు నష్టపోయారన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.


