వైఎస్సార్ సంల్పంతోనే రాయలసీమకు నీళ్ళు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : దివంతగ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంకల్పంతోనే రాయలసీమలో నీళ్లు చూస్తున్నామని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురువారం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులురెడ్డి విలేకరుల సమావేశంలో ఒక విలేకరి మాట్లాడుతూ ఈనెల 26న ఆలోచనపరుల వేదిక నాయకులు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తిగా కాకుండానే పోలవరం బనకచర్ల ఎత్తిపోతల పథకం పేరుతో రెండు లక్షల కోట్ల అదనపు భారాన్ని రాయలసీమ రైతాంగంపై మోపుతున్నారు అన్న అభియోగాన్ని ప్రస్తావన చేశారు. అందుకు శ్రీనివాసులు రెడ్డి స్పందిస్తూ పంట కాలువల కంటే ప్రధాన కాలువ ముఖ్యం అంటూ కాలం చెల్లిన విధానాలను పట్టుకు వేలాడే కమ్యూనిస్టులు అంటూ, నీటి కోసం ఏడు దశాబ్దాలుగా యుద్ధం చేస్తున్న ఎవరూ పట్టించుకోవడంలేదని చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యత కల్పించి నిర్మాణానికి నిధులు కేటాయించి రాయలసీమలో అక్కడక్కడ నీళ్లు చూడగలుగుతున్నామంటే వైఎస్సార్ సంకల్పమే అన్నారు. కమ్యూనిస్టుల పోరాటాలకు గుర్తింపుగా గండికోట ఎద్దుల ఈశ్వర్ రెడ్డి, వెలుగొండకు పూల సుబ్బయ్య పేర్లను పెట్టి ఉద్యమకారులను గౌరవించిన చరిత్రను శ్రీనివాసులు రెడ్డి తెలుసుకోవాలన్నారు. చారిత్రాత్మకమైన విజయాలు సాధించిన కమ్యూనిస్టు పార్టీ ఎక్కడ.. ఏ సిద్ధాంతం లేకుండా అవకాశవాద రాజకీయాలకు అడ్డాగా మారిన తెలుగుదేశం పార్టీ ఎక్కడ.. అన్నారు. కార్యక్రమంలో సీపీఐ నగర కారదర్శి వెంకట శివ పాల్గొన్నారు.


