ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి
అట్లూరు : బతుకుదెరువు కోసం ట్రాక్టర్ తీసుకుని వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ అదే ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి చెందిన హృదయ విదారకరమైన ఘటన అట్లూరు మండలం కుమ్మరవారిపల్లె గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా త్రిపురాంతకంకు చెందిన దగ్గుల అంజిరెడ్డి (55) 20 ఏళ్ల క్రితం అట్లూరు మండలం కుమ్మరవారిపల్లె గ్రామానికి వచ్చి అదే గ్రామంలో సరస్వతి అనే మహిళను పెళ్లి చేసుకొన్నాడు. ఓ ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి ఆ ట్రాక్టర్ ద్వారా వ్యవసాయ పనులు చేసుకుంటూ ఆయన జీవనం సాగించేవాడు. వారికి కుమార్తె వెంకట నారాయనమ్మ ఉంది. ఆమె 7వ తరగతి చదువుతోంది. శుక్రవారం ఉదయం పక్క ఊరు చిన్నరాజుపల్లికి దగ్గర మాగానిలో ట్రాక్టర్ రోటవేటర్‌తో అంజిరెడ్డి సేద్యం చేస్తున్నాడు. అయితే ఉన్న ఫలంగా ట్రాక్టర్ బురదలో ఇరుక్కపోవడంతో వెలికితీసే క్రమంలో ప్రమాదవ శాత్తు ట్రాక్టర్ ఇంజిన్ పల్టీ కొట్టింది. ఆ ఇంజిన్ కింద అంజిరెడ్డి పడిపోయి బుదర కూరకపోయి ఊపిరి ఆడక మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందివ్వడంతో స్థానిక ఎస్‌ఐ రామకృష్ణయ్య తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భార్య, కుమార్తె బోరున విలపించారు. వీధిన పడ్డ ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు.


