నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం
భార్గవ్ రెడ్డి
కమలాపురం: చింతకొమ్మదిన్నె మండలంలో లేని భూమిని సృష్టించి తాను అడ్వాన్స్ తీసుకున్నానని నాపై ఓ పత్రికలో వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని బీసీపీపీఎల్ హెచ్‌ఆర్ మేనేజర్ భార్గవ్‌రెడ్డి వివరించారు. శుక్రవారం కమలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చింతకొమ్మదిన్నె మండలంలోని ల్యాండ్ గురించి తనకు ఏ మాత్రం తెలియదని, ఇందులో తాను అడ్వాన్స్ తీసుకున్నానని వచ్చిన కథనంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కొన్నాళ్ల క్రితం తనకు బాగా తెలిసిన ఓ వ్యక్తి వచ్చి తన భూమి ఆన్‌లైన్ కావడం లేదని రెవెన్యూ అధికారులకు చెప్పాలని నన్ను కోరాడు. తెలిసిన వ్యక్తి కావడం, అందులోనూ పదే పదే అడుగుతుండటంతో తనకు తెలిసిన ఓ అధికారికి ఫోన్ చేసి ఆ వ్యక్తికి సంబంధించిన ల్యాండ్ ఆన్‌లైన్ చేయాలని కోరానన్నారు. అయితే ఆ అధికారి ఆ భూమి ఆన్‌లైన్ కాదని, కుటుంబ సభ్యుల సమస్య ఉందని, దానిని ఏమీ చేయలేమని చెప్పడంతో తాను అదే మాట ఆ వ్యక్తికి చెప్పానని, అంతకు మించి తనకు ఏమీ తెలియదన్నారు. నేను భారతి సిమెంట్ లో పని చేస్తుండటంతో రెవెన్యూలో తిరుగుతుంటానని, దాని వలన అతడు నన్ను ఈ విషయం అడిగాడన్నారు. దానిని బేస్ చేసుకుని వారు అడ్వాన్స్ ఇప్పించుకున్నారేమోనన్నారు. ఆ భూమి గురించి గాని, ఆ సర్వే నెంబర్ల గురించి గాని, అడ్వాన్స్‌గురించి గాని నాకు తెలియదన్నారు. మూడు రోజుల క్రితం మహబూబ్ ఖాన్ అనే వ్యక్తి మీ ఫిర్యాదు చేశాడని సీఐ ఫోన్ చేసి రావాలని చెప్పడంతో నేను స్టేషన్‌కు వెళ్లి ఇదే విషయం చెప్పానన్నారు. మహబూబ్ ఖాన్ అనే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదన్నారు. సీఐకు కూడా ఇదే స్టేట్‌మెంట్ ఇచ్చానన్నారు.


