అమరవీరుల త్యాగాలు మరువలేనివి
కడప అర్బన్ : శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని జిల్లా ఏఎస్పీ(పరిపాలన) కె.ప్రకాష్ బాబు పేర్కొన్నారు. కడప మహిళా పోలీస్ స్టేషన్ వద్ద అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ గురువారం సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఏఎస్పీ మాట్లాడుతూ పండగల సమయాల్లో అందరు ఇళ్లలో ఉంటే .... పోలీసులు రోడ్లపై బందోబస్తు విధుల్లో ఉంటారన్నారు. నిరంతరం ప్రజల పరిరక్షణలో ఉంటున్న పోలీసులకు ప్రజలు సహాయ, సహకారాలు అందించాలని కోరారు. ఏఆర్ ఏఎస్పీ బి.రమణయ్య మాట్లాడుతూ పోలీసు శాఖలో విధులు సంక్లిష్టంగా ఉంటాయని, సైనికులు దేశ సరిహద్దుల్లో, పోలీసులు దేశంలోని అంతర్గత శాంతి భద్రతల సంరక్షణ విధులు నిర్వహిస్తూ ప్రజలు ప్రశాంతంగా జీవించేలా కృషి చేస్తున్నారన్నారు. అనంతరం అమరవీరుల త్యాగాలు, వారి సేవలు ప్రజలకు తెలియజేసే విధంగా పోలీసులు బ్యాండ్ షో రూపంలో దేశభక్తి గీతాలు ఆలపించారు. అమరవీరులకు నివాళులర్పిస్తూ రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నాగేశ్వరరావు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ పి.బాలస్వామిరెడ్డి, పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు.


