ఏడుగురిపై కేసు నమోదు
చింతకొమ్మదిన్నె : భూమి అమ్మేస్తామంటూ రూ.60 లక్షలు తీసుకుని మోసం చేశారని బాధితులు కోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదు చేసినట్లు చింతకొమ్మదిన్నె ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. మండలంలోని మామిళ్లపల్లె రెవెన్యూ పొలంలో తమకు సరైన పత్రాలు, హక్కులు లేకున్నా విలువైన భూమి ఉందని కడప నగరానికి చెందిన కొందరు వ్యక్తులు చెప్పారు. దీంతో కడపకు చెందిన పఠాన్ మహబూబ్‌ఖాన్ ఆ భూమిని కొనేందుకు రూ.60 లక్షలు ఇచ్చారు. అనంతరం వారు భూమిని అమ్మకపోవడంతో మోసపోయానని గ్రహించి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఏడుగురు వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
20 తులాల బంగారు
నగల అపహరణ
కమలాపురం : పట్టపగలే దొంగలు ఇంట్లోకి చొరబడి బంగారు నగలను అపహరించారు. బాధితుల వివరాల మేరకు.. పట్టణంలోని రెడ్డికాలనీకి చెందిన నీలం పెద్దరెడ్డయ్య తన కుమారుడు చిదంబరంతో కలిసి ప్రొద్దుటూరుకు వెళ్లారు. రెడ్డెయ్య భార్య కింది ఇంటికి వెళ్లింది. ఆమె కళ్లు కప్పి ఇంట్లో వెళ్లిన దుండగులు అల్మారాలో ఉన్న బీగాలు తీసుకుని బీరువా తెరిచారు. అందులో 20 తులాల బంగారు నగలు దోచుకెళ్లారు. అక్కడే ఉన్న రూ.4 వేల నగదు ముట్టుకోలేదు. రాత్రి పెద్దరెడ్డెయ్య వచ్చి చూసుకుని .. బంగారం చోరీ అయినందని తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. ప్రతి రూపాయి దాచి పోగుచేసిన డబ్బుతో కొన్న బంగారం దోచుకెళ్లారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.


