బద్వేలులో పర్యటించిన కలెక్టర్
బద్వేలు అర్బన్/పోరుమామిళ్ల : మోంథా తుపాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో బుధవారం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ బద్వేలులో పర్యటించారు. స్థానిక మైదుకూరు రోడ్డులో వర్షపునీరు నిలుస్తున్న ప్రాంతాన్ని, డ్రైనేజీని పరిశీలించడంతో పాటు బద్వేలు పెద్ద చెరువును పరిశీలించారు. ప్రధాన రహదారుల్లో నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ కాలువలు విస్తరణ చేయడానికి అంచనాలు, డిజైన్ తయారు చేయాలని ఆర్డీఓ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ వి.వి.నరసింహారెడ్డిలను ఆదేశించారు. అనంతరం బద్వేలు పెద్ద చెరువును సందర్శించి చెరువు సామర్థ్యం, చెరువు కింద ఉన్న ఆయకట్టు వివరాలను ఇరిగేషన్ డీఈ వేణుగోపాల్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
పోరుమామిళ్ల చెరువు పరిశీలన
పోరుమామిళ్ల మండలంలో వాగులు వంకలు ఉప్పొంగాయి. పంటలు దెబ్బతిన్నాయి. రాజాసాహేబ్‌పేట, టే కూరు, టేకూరుపేట, సూరిశిద్దుపల్లె, తిమ్మారెడ్డిపల్లె, తోకలపల్లె, యరసాల గ్రామ పొలాలు నీటితో నిండాయి. కోత కోసి ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌బాబు బుధవారం సాయంత్రం పోరుమామిళ్ల చెరువును సందర్శించారు. దమ్మన్నపల్లె వద్ద రైతులు రోడ్డుపై పోసుకున్న ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. నీరు పారడం వల్ల దెబ్బతిన్న పొలాల గురించి, పంట దెబ్బతిన్న పొలాల గురించి కలెక్టర్ అధికారులను విచారించారు. నష్టం గురించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.


