
వాసు.. అధ్యక్షుడని చెప్పుకోవడానికే సిగుచేటు
్గ
కడప రూరల్: ‘రెడ్డెప్పగారి శ్రీనివాసులురెడ్డి (వాసు).. ఆయన మా పార్టీ జిల్లా అధ్యక్షుడని చెప్పుకోవడాకే సిగ్గు చేటుగా ఉంది. అది కడప నగర కమిటీ కాదు.. దొంగగా వచ్చి చేరిన వారి కమిటీ’ అని కడప నియోజక వర్గానికి చెంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ధ్వజమెత్తారు. శనివారం కడపలోని సాయిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్‌చార్జి ఆర్‌కే మాబుల్లాఖాన్ మాట్లాడారు. పార్టీ కడప నగర కమిటీకి అధ్యక్షుడిగా దొంగగా మన్సూర్ అలీఖాన్ వచ్చారన్నారు. నూతనంగా ప్రకటించిన కడప నగర కమిటీ, అసలు తెలుగుదేశం పార్టీ కమిటీనే కాదని తెలిపారు. నగర అధ్యక్షుడు మన్సూర్ అలీఖాన్ అసలు సిసలైన కార్యకర్తల గురించి విమర్శిస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. అలాగే మరో 8 మంది పార్టీ ఫిరాయింపు కార్పొరేటర్లను దొంగల్లా టీడీపీలోకి తెచ్చారని, వారు పెత్తనం చెలాయిస్తున్నారని పేర్కొన్నారు. తన సోదరుడు, పార్టీ కార్యకర్త కరీంఖాన్ చనిపోయారని అన్నారు. ఆ విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి చెబితే, మరణించిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి రాకుండా, తనకు బిజీ షెడ్యూల్ ఉందని చెప్పడం ఆయనకే చెల్లిందన్నారు. ఆఖరికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా అటు వైపు కన్నెత్తి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారు పార్టీ కార్యకర్తలకు ఇచ్చే మర్యాద ఇదేనా అని నిలదీశారు. మానవతా ధృక్ఫదంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా సోదరుడు అహ్మద్‌బాషా 80 మంది అనుచరులతో వచ్చి మరణించిన తన సోదరుడి కుటుంబాన్ని పరామర్శించారని తెలిపారు. ఇతర పార్టీ నేతలకు ఉండే దయా హృదయం, ఇంకిత జ్ఞానం శ్రీనివాసులురెడ్డికి లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నామని, అయితే తమకు ఏ మాత్రం గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 39వ డివిజన్ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు షా మొహమ్మద్ మాట్లాడుతూ పార్టీలో సీనియర్ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, బయటి నుంచి వచ్చిన వారిని అందలం ఎక్కిస్తున్నారని ఆరోపించారు.
‘పుత్తా’ వద్దకు వెళ్తుంటే
పోలీసుల చేత బెదిరింపులు
కొండ్రెడ్డి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కడప అసెంబ్లీలో టీడీపీ కార్యకర్తల పరిస్ధితి అధ్వానంగా మారిందన్నారు. మాధవిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత సీనియర్ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో అర్ధం గాక, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహరెడ్డి వద్దకు వెళ్తున్నామని అన్నారు. ఆయన వద్దకు వెళ్లిన మరుక్షణం పోలీస్ స్టేషన్‌ల నుంచి ఫోన్‌లు.. బెదిరింపులు వస్తున్నాయని వాపోయారు. మాజీ శాప్ డైరెక్టర్ జయచంద్ర మాట్లాడుతూ సీనియర్ కార్యకర్తలపై ఆరోపణలు చేస్తున్న వారు పార్టీ సభ్యత్వం కార్డును చూపించి మాట్లాడాలన్నారు. పార్టీ ఫిరాయింపు దారుల పెత్తనం టీడీపీలో ఎక్కువైందన్నారు. పార్టీ కోసం పని చేసిన అసలు కార్యకర్తలు ఎవరో.. నకిలీ కార్యకర్తలు ఎవరో నిగ్గు తేల్చడానికి ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కార్యక్రమంలో ఆ పార్టీ కార్యకర్తలు షేక్ సలీం, వాహిద్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి రాలేదు
ఎక్కడి నుంచో వచ్చిన వారికి అందలం
అసలు కార్యకర్తలు ఎవరో.. నకిలీ వారెవరో చర్చకు సిద్ధమా?
కడప టీడీపీ సీనియర్ నాయకుల సవాల్