
తహసీల్దార్ కార్యాలయంలో కలెక్షన్ కింగ్!
● ఏ పని కావాలన్నా ఆయనే కీలకం
● చేతులు తడిపితే ఓకే.. లేదంటే కాళ్లరిగేలా తిరగాల్సిందే
● ఖాజీపేట తహసీల్దార్ కార్యాలయంలో తిష్టవేసిన అవినీతి
ఖాజీపేట : ఖాజీపేట తహసీల్దార్ కార్యాలయంలోకి నీతి రానంటోంది.. అవినీతి పోనంటోంది. ఎంత మంది అధికారులు, కింది స్థాయి సిబ్బంది సస్పెండ్ అయినా, ఏసీబీకి దొరికినా పనితీరులో మార్పు లేదు. వచ్చిన వారంతా పైసల కోసం కక్కుర్తి పడటం, అందరినీ వేధించడం పరిపాటిగా మారింది. ప్రజల సమస్యలను వారికి లాభంగా మార్చుకుని అందరి దగ్గర నుంచి ముక్కు పిండి మరీ పైసలు వసూలు చేస్తున్నారు. ఎంత ఎక్కువగా తిప్పుకుంటే అంత డబ్బులు అన్నట్లుగా వ్యవహారం ఉండటంతో ప్రజలు ఎక్కువ సార్లు తిరగలేక వారు అడిగిన కాడికి డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..
ఖాజీపేట తహసీల్దార్ కార్యాలయంలో ఒక అధికారి కింగ్ మేకర్‌గా మారాడు. ఏ పని చేయాలన్నా ఆయనదే కీలక పాత్రగా మారింది. ఆయన అనుమతి లేనిదే అలాగే ఆయన సహకారం లేనిదే తహసీల్దార్ కార్యాలయంలో ఏ పనీ పూర్తి కాదు. ప్రతి పనికి ఆయన ఒక ధర నిర్ణయిస్తాడు. ఆ మొత్తం చేతికి వచ్చిందంటే చాలు సెలవు దినాల్లో కూడా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి సెలవులో ఉన్న సిబ్బందిని పిలిపించుకుని మరీ పనులు పూర్తి చేస్తాడు. లేదంటే ప్రజల సమస్యలను అస్సలు పట్టించుకోడు. వారికి చుక్కలు చూపిస్తాడు. ఇలా నెల, రెండు నెలలైనా తిరుగుతూ ఉండాల్సిందే. అదే కాసులు అందితే చకచకా పనులు పూర్తి చేస్తాడు.
దిగువ స్థాయి సిబ్బంది పనితీరూ అంతే..
భూ సమస్యలు, అన్నదమ్ముల భాగ పరిష్కారం పూర్తి చేసుకున్న భూముల నమోదు, ఆన్‌లైన్ నమోదు, పాసు పుస్తకాలు, ఇలా ఒక్కటేమిటి ఏ పని కావాలన్నా దిగువ స్థాయి సిబ్బంది పనితీరు చాలా దారుణంగా ఉంది. కొందరు కట్టుబడి స్థాయి సిబ్బంది కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. మామూళ్లు ఇవ్వనిదే దిగువ స్థాయిలోని వారు సైతం సంతకాలు చేయడం లేదు. అందుకు వారు మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బు ముట్టిందంటే సంతకాలు చేస్తున్నారు. ఇలాంటి అక్రమాలపై ఉన్నతాధికారులు నిఘా ఉంచి ప్రత్యేక చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
టీడీపీ నాయకులకే బేజారు..
తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న తంతును చూసి టీడీపీ నాయకులే బేజారు పడుతున్నారు. అధికార పార్టీలో ఉండి కూడా తమ పనులు జరగడం లేదని వాపోతున్నారు. అధికారుల దగ్గరకు పనులు చేయించుకునేందుకు వెళ్లలేక.. వారి డిమాండ్లు తీర్చలేక సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకుని నిజాయితీగా పనిచేసే వారిని నియమిస్తే బాగుంటుందని కోరుతున్నారు. తమ వద్దకు వచ్చే వారి పనులు కూడా చేయలేక చివరకు తమ పనులు కూడా చేసుకోలేక ఏకంగా తహసీల్దార్ కార్యాలయం వైపు వెళ్లడమే మానుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.