
సబ్సిడీ విత్తనం ఇంకెప్పుడు!
ఖరీఫ్ ముగిసింది.. రబీ వచ్చింది.. విత్తనం మాటే లేదు.. చినుకు రాలింది.. నేల తడిసింది.. సబ్సిడీ విత్తనం ఊసే లేదు.. కూటమి ప్రణాళిక లోపం అన్నదాతకు శాపమవుతోంది. పదునెక్కిన ఈ వానకు పొలమంతా నాగలిపట్టాల్సిన రైతు.. విత్తనం కోసమే ఎదురుచూడాల్సిన దుస్థితి తలెత్తింది. ఒకటా రెండా సీజన్ మొదలై పక్షం రోజులు దాటినా సబ్సిడీ విత్తన పంపిణీకి మోక్షం రావడం లేదు.
రాజుపాళెంలో శనగసాగుకు ట్రాక్టర్‌తో పొలాన్ని సిద్దం చేస్తున్న రైతు, ఎర్రగుంట్ల మండలంలో శనగసాగుకు విత్త్తనాన్ని సిద్దం చేసుకుంటున్న రైతన్న
కడప అగ్రికల్చర్: జిల్లాలో సబ్సిడీ శనగ విత్తన పంపిణీ అతిగతి లేకుండా పోయింది. రబీ సీజన్ ప్రారంభమై పక్షం రోజులు దాటినా ప్రభుత్వం ఇంతవరకు విత్తన పంపిణీ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విత్తనాల పంపిణీకి ముందు కనీసం రైతుభరోసా కేంద్రాలలో రైతుల నుంచి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించకపోవడంతో ఇక విత్తన పంపిణీ ఎప్పుడు చేస్తారని అన్నదాతలు మండిపడుతున్నారు. గతేడాది విత్తనాలను సరఫరా చేసిన టెండర్ దార్లకు ఇంతవరకు బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఈ ఏడాది విత్తన పంపిణీ ఆలస్యమవుతోన్నట్లు సమాచారం.
పదును ఆరిపోతుందనే...
ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో చాలా ప్రాంతాలలో పదును అయ్యింది. ఈ పదునులోనే చాలా మంది రైతులు శనగ పంటను సాగు చేయనున్నారు. కాకపోతే ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలను సరఫరా చేయకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు రెండు లక్షల ఎకరాలలో శనగపంటను సాగుకానుంది.
మండలాల్లో ఇబ్బందులకు
గురవుతున్న ఏవోలు.
జిల్లాలో శనగపంటను అధికంగా సాగు చేసే మండలాలైన పెద్దముడియం, రాజుపాలెం, తొండూరు, సింహాద్రిపురం, వేముల, వేంపల్లి, కొండాపురం, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, మైలవారంతోపాటు పలు మండాలల్లో పనిచేసే వ్యవసాయ అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారు. శనగను సాగు చేసే రైతులు రైతు భరోసా కేంద్రాల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. దీనికి తోడు రైతులు అడిగే ప్రశ్నలకు వ్యవసాయ అధికారుల నుంచి మౌనమే సమాధానంగా ఉంటుందని రైతులు తెలిపారు.
రైతుల నుంచి విత్తనాలను కొనుగోలు...
ప్రభుత్వం సరఫరా చేస్తే సబ్సిడి విత్తనాల కోసం ఎదురు చూస్తే పదును ఆరిపోతుందని భావించిన పలువురు రైతులు ప్రైవేటు రైతుల నుంచి శనగలు కొనుగోలును చేస్తున్నారు. పైగా ప్రభుత్వం సరఫరా చేసే శనగ విత్తనాలు ఏవిధంగా ఉంటాయోననే ఆందోళన కూడా రైతులను వేధిస్తుంది.
ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట
రైతులకు సరఫరా చేసే శనగ విత్తనాల పంపిణీలో ప్రభు త్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. రైతుల సమ స్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ముందస్తు ప్రణాళిక లేని కారణంగానే విత్తనాల సరఫరాను సకాలంలో సరఫరా చేయలేకపోయింది. దీంతో చాలా మంది రైతులు బయట మర్కెట్ నుంచి కొనుగోలు చేసి తెచ్చుకోవాల్సి వచ్చింది. – గాలి చంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి

సబ్సిడీ విత్తనం ఇంకెప్పుడు!

సబ్సిడీ విత్తనం ఇంకెప్పుడు!