మంచిరోజులొస్తాయి | - | Sakshi
Sakshi News home page

మంచిరోజులొస్తాయి

Sep 2 2025 7:18 AM | Updated on Sep 2 2025 8:01 AM

-

ప్రజలు, కార్యకర్తల్లో భరోసా నింపిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

తొలి రోజు ప్రజలతో మమేకం

పులివెందుల : కూటమి ప్రభుత్వంలో అబద్ధాలకు, మోసాలకు అంతు లేకుండా పోయిందని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. కార్యకర్తలు, ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదని.. త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఆయన వారికి భరోసా కల్పించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం జిల్లాకు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తన సతీమణి వైఎస్‌ భారతిరెడ్డితో కలిసి వైఎస్‌ జగన్‌ పులివెందులలోని తన నివాసానికి చేరుకున్నారు. 

అనంతరం వైఎస్‌ జగన్‌ భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని ప్రజలతో మమేకమయ్యారు. కూటమి ప్రభుత్వంలో తాము పడుతున్న కష్టాలను ప్రజలు వివరించగా ఓపిగ్గా విన్నారు. అధినేతను కలిసినవారిలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, బద్వేల్‌ ఎమ్మెల్యే సుధ, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేష్‌ యాదవ్‌, రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజాద్‌ బాషా, శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసు లు, సుధీర్‌రెడ్డి, గంగుల భాను, కడప మేయర్‌ సురేష్‌బాబు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి, చెవిరెడ్డి కుమారుడు హర్షిత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కమలాపురం ఇన్‌చార్జి నరేన్‌ రామాంజనేయరెడ్డి, పూల శ్రీనివాసులరెడ్డి, మాజీ ఆప్కాస్‌ చైర్మన్‌ ఝాన్సీరాణి, జెడ్పీ మాజీ చైర్మన్‌ సుగవాసి బాలసుబ్రమణ్యం, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, పులివెందుల మున్సిపల్‌ ఇన్‌చార్జి వైఎస్‌ మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్‌, వైస్‌ చైర్మన్‌ హఫీజ్‌ ఉన్నారు.

పింఛన్ల తొలగించారంటూ మహిళల ఆవేదన
పులివెందుల పట్టణం నగరిగుట్ట ప్రాంతానికి చెందిన రాజకుళ్లాయమ్మ అనే మహిళ తన పింఛన్‌ తీసేశారంటూ వైఎస్‌ జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన పింఛన్‌ను తొలగిస్తున్నట్లు నోటీసు ఇచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. 

అలాగే పులివెందుల మండలం కనంపల్లెకు చెందిన కృపావతి అనే వితంతువు కూడా తన పింఛన్‌ తొలగించారని వాపోయింది. దీనికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ చంద్రబాబు ప్రభు త్వం దాదాపు 4లక్షల పింఛన్లు తొలగించారని మండిపడ్డారు. అధైర్యపడొద్దని, పింఛన్ల విషయంలో న్యాయ పోరాటం చేద్దామని వారికి భరోసా కల్పించి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సూచించారు.

మాజీ ఎమ్మెల్యేకు పుట్టిన రోజు
శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌కుమార్‌కు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పులివెందులలోని తన నివాసంలో కలిసిన ఆయన్ను శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు కేక్‌ తినిపించారు.

ఆటోగ్రాఫ్‌... ప్రకాశం జిల్లా దర్శికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ చంద్రశేఖర్‌రెడ్డిని వైఎస్‌ జగన్‌ అభినందించారు. ఇటీవల కశ్మీర్‌ ప్రాంతంలోని లడాక్‌ ట్రిప్‌కి వెళ్లిన చంద్రశేఖర్‌ రెడ్డి భూమికి దా దాపు 18వేల అడుగుల ఎత్తైన ప్రాంతాన్ని చేరుకుని వైఎస్సార్‌ సీపీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అప్పటి ఫొటోలను వైఎస్‌ జగన్‌కి చూపించగా.. ఆయన అభినందించి జెండాపై ఆటోగ్రాఫ్‌ చేశారు.

నేడు ఇడుపులపాయలో వైఎస్సార్‌కు నివాళి
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ సమాధి వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఉదయం 7.15గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుంటారు. అక్క డ వైఎస్సార్‌కు నివాళులర్పించడంతోపాటు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. 

అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 10.30 గంటలకు లింగాల మండలం అంబకపల్లె గ్రామానికి చేరుకుంటారు. అక్కడ గంగమ్మ కుంట చెరువు వద్ద నీటికి జలహారతి ఇవ్వనున్నారు. అక్కడినుంచి తిరిగి 12.30గంటలకు పులివెందులలోని తన నివాసానికి చేరుకుంటారు. అనంతరం 2.30 గంటల నుంచి 7.25గంటలవరకు భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలతో ఆయన మమేకం కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement