
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలను స్వీకరించారు. కలెక్టర్‌తో పాటు జేసీ అదితి సింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యా దులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. ఎండార్స్ ఇచ్చిన అర్జీలకు జిల్లా అధికారులు ఖచ్చితంగా పరిశీలించాలన్నారు. ఎవరైనా అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఐవీ ఎయిడ్స్‌పై అరవై రోజుల విస్తృత ప్రచారం కల్పించాలని పోస్టర్లను కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఎస్డీసి వెంకటపతి,వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.