
ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి.. యువకులకు తీవ్ర గాయాలు
అట్లూరు : ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ద్విచక్రవాహనం అదుపుతప్పి ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడిన సంఘటన అట్లూరు మండలం కడప–బద్వేలు ప్రధాన రహదారిపై రెడ్డిపల్లి వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు అట్లూరు మండల పరిధిలోని ఎస్.వెంకటాపురం ఉప్పుటూరు కాలనీకి చెందిన శ్రీబాబు, గోపినాథపురం గ్రామానికి చెందిన సానపురెడ్డి నరసింహారెడ్డి ఇద్దరు పుట్టుకతోనే మూగ, చెవిటి వారు. ఇద్దరూ కడపలో డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. శ్రీబాబు ఓ ప్రైవేటు సీసీ కెమెరాల కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం ఇద్దరూ అట్లూరు వైపు ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఉన్నట్టుండి రెడ్డిపల్లి క్రాస్ రోడ్డు వద్ద గడ్డి మోపుతో మరో ద్విచక్రవాహనం అడ్డు రావడంతో దాన్ని తప్పించ బోయి అదుపుతప్పి కిందపడ్డారు. శ్రీబాబు తలకు తీవ్ర గాయాలు కాగా నరసింహారెడ్డికి చేయి విరిగింది. 108 వాహనం ద్వారా పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు.
అదుపు తప్పి ముళ్ల పొదల్లోకి వెళ్లిన కారు
సిద్దవటం : సిద్దవటం మండలం, కడప–చైన్నె జాతీయ రహదారి భాకరాపేట గ్రామ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నగరంలోని ఐటీఐ సర్కిల్‌కు చెందిన వెంకటరమణ, ఆయన భార్య ఈశ్వరమ్మ, కుమార్తె యామినితో కలిసి ఒక శుభ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రేణిగుంటకు కారులో బయలుదేరారు. కారు సిద్దవటం మండలంలోని శనేశ్వరస్వామి ఆలయం దాటుకొని వస్తుండగా ఆవు అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయి అదుపు తప్పి ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఈశ్వరమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న సిద్దవటం ఎస్‌ఐ మహమ్మద్ రఫీ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు.
తీవ్రంగా గాయపడిన శ్రీబాబు
చేయి విరిగిన నరసింహారెడ్డి

ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి.. యువకులకు తీవ్ర గాయాలు

ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి.. యువకులకు తీవ్ర గాయాలు