ప్రొద్దుటూరు : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియలో ప్రొద్దుటూరును జిల్లా కేంద్రం చేయాలని ప్రముఖ వైద్యుడు డాక్టర్ డి.నాగదస్తగిరిరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ నాగదస్తగిరిరెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రం చేసేందుకు ప్రొద్దుటూరుకు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు నియోజవకర్గాలతో కలిపి జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జిల్లా కేంద్రాన్ని ప్రకటించే వరకు సాధన సమితి ఆధ్వర్యంలో నిరంతరం కార్యక్రమాలను చేపడతామన్నారు. ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరును జిల్లా కేంద్రం చేయాలనేది ఎన్నో ఏళ్లుగా ప్రజల ఆకాంక్ష అన్నారు. ప్రొద్దుటూరులో జిల్లా కోర్టుతోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని, జిల్లాకు సంబంధించి ఆదాయంలో సింహభాగం ప్రొద్దుటూరు నుంచే ఉందన్నారు. అయినా ప్రొద్దుటూరు కనీసం రెవెన్యూ డివిజన్‌కు కూడా నోచుకోలేదన్నారు. ప్రముఖ న్యాయవాది సీవీ సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అతి తక్కువ జనాభాతో మన్యం జిల్లాను, ఎక్కువ జనాభాతో నెల్లూరు జిల్లాను గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రొద్దుటూరు పాలకేంద్రం పరిధిలో సుమారు 1000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, జిల్లా కేంద్రం ప్రకటిస్తే ఇక్కడే కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించవచ్చన్నారు. స్పందన సంస్థ అధ్యక్షుడు శెట్టిపల్లె రాంప్రసాద్ రెడ్డి, ఎస్‌ఆర్ వెంకటజనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ త్రేతాయుగం నుంచి ప్రొద్దుటూరుకు ప్రాశస్థ్యం ఉందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా మహాత్మాగాంధీ ప్రొద్దుటూరులో పర్యటించారన్నారు. 1915లో బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఏర్పడిందన్నారు. మనకన్నా చిన్నదైన రాయచోటిని జిల్లా కేంద్రం చేశారని, రాజంపేటను పార్లమెంట్ స్థానం చేశారని, త్వరలో మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయబోతున్నారన్నారు. 1970లోనే పరిశ్రమల కోసం ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌ను ఏర్పాటు చేశారన్నారు. ప్రొద్దుటూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని క్యాబినెట్ సబ్ కమిటీకి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడు టీడీ వరుణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరును జిల్లాగా ప్రకటిస్తే వైద్య కళాశాల రావడంతోపాటు ప్రస్తుతం ఉన్న జిల్లా ప్రభుత్వాస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఏర్పడుతాయన్నారు. సమావేశంలో సభ్యులు భాస్కర్‌రావు, ఎన్జీఓ అసోసియేషన్ తాలూకా అధ్యక్షుడు కేజే రఘురామిరెడ్డి, గజ్జల వెంకటేశ్వరరెడ్డి, అయూబ్ ఖాన్, నంద్యాల వెంకటశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
12 మందితో జిల్లా సాధన సమితి ఏర్పాటు