
పోలీసు శాఖకు మీ సేవలు చిరస్మరణీయం
కడప అర్బన్ : క్రమశిక్షణ, అంకితభావంతో నాలుగు దశాబ్దాలపాటు నిర్విరామంగా పోలీసు శాఖకు సేవలందించి పదవీ విరమణ పొందడం అభినందనీయమని జిల్లా ఎస్.పి ఈ.జి. అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఆగస్టు నెలాఖరున పదవీ విరమణ పొందిన ఎ.శివనాగేంద్ర కుమార్, ఎస్.ఐ, డి.సి.ఆర్.బి. కడప, ఎ.వి. రమణయ్య, ఎ.ఎస్.ఐ, కమలాపురం, బి.శ్రీనివాసులు, ఎ.ఆర్.హెచ్.సిలను ఆదివారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెనన్స్ హాలులో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి సెల్ ఫోన్లు, కమ్యూనికేషన్ లేని రోజుల్లో కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహించడం మామూలు విషయం కాదన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా, సమస్యలున్నా బాధ్యత అనేది పోలీస్ శాఖలో సమస్యలను అధిగమించేలా చేస్తుందన్నారు. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ పిల్లలను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడం సంతోషంగా ఉందన్నారు. పదవీ విరమణ తర్వాత కుటుంబ సభ్యులతో గడుపుతూ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్.పి. బి.రమణయ్య, ఏ.ఆర్ డి.ఎస్.పి. కె.శ్రీనివాసరావు, ఆర్.ఐ లు వీరేష్, టైటస్, డి.సి.ఆర్.బి. ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్ రెడ్డి, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, ఈ.సి. మెంబర్ ఏఫ్రిన్, పదవీ విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఉద్యోగ విరమణ వీడ్కోలు సమావేశంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్