
ప్రశాంతంగా సర్టిఫికెట్ల పరిశీలన
సిబ్బందికి సూచనలు ఇస్తున్న డీఎస్సీ స్టేట్ అబ్జర్వర్
సర్టిఫికెట్ల పరిశీలకు వచ్చిన ఎంపికై న అభ్యర్థులు
కడప ఎడ్యుకేషన్: డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం నిర్వహించారు. కడపలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యాశాఖ 17 టీమ్స్‌తోపాటు 30 మంది వలంటీర్లను ఏర్పాటు చేసింది.
జిల్లావ్యాప్తంగా డీఎస్సీ లాగిన్ ఐడీ ద్వారా కాల్ లెటర్స్ అందుకున్న 609 మంది అభ్యర్థులు పరిశీలన కేంద్రానికి చేరుకున్నారు. పత్రాల పరిశీలన ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆన్‌లైన్‌లో అభ్యర్థుల కుల ధ్రువీకరణ, టెట్ మార్కులకు సంబంధించి లాగిన్‌లో కనిపించకపోవడంతో సర్టిఫికెట్ల పరిశీలన ఆలస్యమైంది. దీంతో పత్రాల పరిశీలన బాగా పొద్దుపోయేదాకా జరిగింది. రాత్రి పూట పరిశీలన కేంద్రంలో సరైన లైటింగ్ వసతి లేక తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు పలువురు అభ్యర్థులు తెలిపారు.
పరిశీలన కేంద్రాన్ని పరిశీలించిన
డీఈఓ, స్టేట్ అబ్జర్వర్లు..
డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాన్ని డీఈఓ షేక్ షంషుద్దీన్‌తో కలిసి డీఎస్సీ స్టేట్ అబ్జర్వర్ మధుసూదన్‌రావు పరిశీలించారు. సర్టిఫికెట్ల పరిశీలన ఎలా జరగుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీనల కోసం కడప కేంద్రంలో 17 టీమ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. జోనల్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులు ఏ జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్నారో ఆ జిల్లాలోనే ధ్రువ పత్రాలను పరిశీలించుకోవచ్చన్నారు. మెడికల్ గ్రౌండ్స్ ఉన్న అభ్యర్థులు కూడా సర్టిఫికెట్లు పరిశీలించుకోవచ్చని వివరించారు.

ప్రశాంతంగా సర్టిఫికెట్ల పరిశీలన