కాలేజీకి వెళ్తున్నానని చెప్పి.. | - | Sakshi
Sakshi News home page

కాలేజీకి వెళ్తున్నానని చెప్పి..

Jul 16 2025 3:47 AM | Updated on Jul 16 2025 3:47 AM

కాలేజీకి వెళ్తున్నానని చెప్పి..

కాలేజీకి వెళ్తున్నానని చెప్పి..

శవమై వచ్చావా తల్లీ!

బాలిక కుటుంబంలో తీరని విషాదం

ఇలాంటి వాళ్లతో ఆడపిల్లలకు రక్షణ ఉండదు

వీళ్లను ఎన్‌కౌంటర్‌ చేయాలి :

బాలిక తండ్రి కొండయ్య ఆవేదన

ముందు రోజు సాయంత్రంప్రొద్దుటూరులో మిస్సింగ్‌ కేసు నమోదు

ప్రొద్దుటూరు క్రైం: ‘అమ్మా కాలేజీకి వెళ్లాలి త్వరగా టిఫిన్‌ పెట్టు.. వస్తున్నా... ఇదిగో పట్టు నేనే తినిపిస్తా.. ఇక చాలమ్మా.. కాలేజీకి టైం అయింది. నేను వెళ్లాలి..’ఇది కూతురు.. ఆమె తల్లి మధ్య జరిగిన చివరి సంభాషణ. బ్యాగ్‌ తీసుకొని కుమార్తె కాలేజీకి బయలుదేరింది. వీధి చివర వరకు తల్లి అలానే చూస్తూ ఉండిపోయింది. అలా కళాశాలకని వెళ్లిన బాలిక కొన్ని గంటల్లోనే శవమై కనిపించింది.

● ఎర్రగుంట్ల మండలంలోని హనుమనగుత్తికి చెందిన పసుపులేటి కొండయ్య బేల్దారి పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఆతనికి భార్య దస్తగిరమ్మతో పాటు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మొదటి కుమారుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా కుమార్తె స్థానికంగా ఉన్న ప్రైవేట్‌ బాలికల జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతోంది. మరో కుమారుడు 7వ తరగతి చదువుతున్నాడు. వీళ్లకు ప్రొద్దుటూరులోని సార్వకట్టవీధిలో సొంత ఇళ్లు ఒకటి ఉంది. గ్రామం నుంచి కాలేజీకి వెళ్లిరావడానికి కూతురికి ఇబ్బందిగా ఉందని భావించి ఆర్నెళ్ల క్రితం ప్రొద్దుటూరుకు వచ్చారు.

కుమార్తె కాలేజీకి రాలేదని ఫోన్‌ రావడంతో..

సదరు బాలిక సోమవారం ఉదయం 7.30 గంటలకు ఇంటి నుంచి కళాశాలకు వెళ్లింది. ప్రతి రోజు ఆమెను సోదరుడు కాలేజీకి తీసుకెళ్లేవాడు. అతను ముందురోజే చైన్నెకి వెళ్లడంతో..బాలిక ఒంటరిగా కాలేజికి వెళ్లింది. డ్వాక్రా సంఘానికి సంబంధించిన సమావేశం ఉండటంతో తల్లి దస్తగిరమ్మ కొద్దిసేపటి తర్వాత స్వగ్రామమైన హనుమనగుత్తికి వెళ్లిపోయింది. తండ్రి కొండయ్య కూడా బేల్దారి పని కోసం ఉదయాన్నే ఎర్రగుంట్లకు వెళ్లాడు. ఈ క్రమంలో వారి కుమార్తె కాలేజీకి రాలేదని సుమారు 9.30 గంటల సమయంలో కొండయ్యకు ఫోన్‌ వచ్చింది. ఇదే విషయాన్ని ఆయన తన భార్యకు తెలిపాడు. దీంతో కుటుంబ సభ్యులందరూ వెంటనే కళాశాల వద్దకు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడారు. అయితే హనుమనగుత్తికి చెందిన ఒక వ్యక్తిపై అనుమానం ఉండటంతో అతని గురించి ఆరా తీశారు. తమ సొంత బంధువుల ద్వారా అతని కదలికల గురించి తెలుసుకున్నారు.

వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు

తమ కుమార్తె కనిపించకపోవడానికి హనుమనగుత్తికి చెందిన లోకేష్‌ అనే వ్యక్తి కారణమై ఉండొచ్చని భావించిన కొండయ్య కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాత్రికి రాత్రే లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. బాలికను గండికోటకు తీసుకెళ్లిన మాట నిజమేనని అతను పోలీసుల వద్ద అంగీకరించాడు.

రాత్రంతా గండికోటలో గాలింపు

పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు లోకేష్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా సోమవారం రాత్రి పోలీసులు అతన్ని గండికోటకు తీసుకెళ్లారు. అక్కడి రెస్టారెంట్‌ రూములతో పాటు పరిసర ప్రాంతాల్లో గాలించారు. గ్రామస్తుల సహాయం తీసుకొని రాత్రంతా గాలించినా బాలిక ఆచూకి లభించలేదు. దీంతో పొద్దుపోయిన తర్వాత పోలీసులు గండికోట నుంచి వచ్చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం బాలిక మృతదేహం గండికోటలోని ముళ్లపొదల్లో ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తమ కుమార్తె శవమై పడి ఉందని తెలియడంతో కుటుంబ సభ్యులు విలపించసాగారు. బంధువులు, సన్నిహితులు పెద్ద ఎత్తున వారి ఇంటి వద్దకు వచ్చి ఓదారుస్తున్నారు.

ఇలాంటి వాళ్లను ఎన్‌కౌంటర్‌ చేయాలి

‘ఇలాంటి వాళ్లతో ఆడపిల్లలకు రక్షణ ఉండదు. వీళ్లు ప్రపంచంలో ఎక్కడున్నా ఎన్‌కౌంటర్‌ చేసి పడెయ్యాలి.. జైళ్లలో పెట్టి ఏళ్ల తరబడి ఈ మృగాలను మేపడం వృధా.. వెంటనే మరణ దండన విధించాలి.. మీ చేత కాకుంటే చెప్పండి నేనే చంపేస్తా’అంటూ బాలిక తండ్రి కొండయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

నిందితులను కఠినంగా శిక్షిస్తాం

కడప కార్పొరేషన్‌: కడప జిల్లా గండికోటలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న విద్యార్థిని హత్యకు గురికావడంపై జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. మహిళలు, బాలికలపై హత్యలకు, హత్యాచారాలకు పాల్పడితే సహించేది లేదని, ఉక్కుపాదంతో అణచివేస్తామని స్పష్టంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement