
ఆశ్రమ స్థలంపై కన్ను
అధికారమే దన్ను..
సాక్షి టాస్క్‌ఫోర్స్: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.. అన్న చందంగా అధికార పార్టీ నేతలు అనుకుంటే.. ఏమైనా చేయగలరు అనడానికి చక్కటి ఉదాహరణ.. ప్రొద్దుటూరులోని మహర్షి ఆశ్రమం కొనుగోలు వ్యవహారం. నిబంధనల ప్రకారం ఈ స్థలాన్ని కొనుగోలు చేయడానికి, అమ్మడానికి ఎవరికీ హక్కులేదు. కేవలం ఆశ్రమ నిర్వహణతోపాటు పేదలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు మాత్రమే పూర్వం మహర్షి విద్యామందిరాన్ని ఏర్పాటు చేశారు. అధికార పార్టీ అండతో స్థానిక ప్రజాప్రతినిధి తనయుడు చక్రం తిప్పి.. ఈ స్థలాన్ని కొనుగోలు చేయించారు. త్వరలో ఈ స్థలంలో వెంచర్ ఏర్పాటు చేసి వ్యాపారం చేయనున్నారు.
దానంగా ఇచ్చిన స్థలం
ప్రొద్దుటూరు పట్టణంలోని బొల్లవరంలో పూర్వం ఢిల్లీకి చెందిన మహర్షి విద్యామందిరం నిర్వాహకులు ఇక్కడ పాఠశాలను ఏర్పాటు చేయడంతోపాటు ఆశ్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నించారు. అప్పట్లో గురుదేవ్ రామిరెడ్డి ఈ ఆశ్రమానికి కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ ఆశ్రమ నిర్వహణ తీరును మెచ్చి బొల్లవరానికి చెందిన కందుల బాలనారాయణరెడ్డి కుమారుడు నరసింహారెడ్డి ఎకరా 15 సెంట్ల స్థలాన్ని దానంగా ఇచ్చారు. సర్వే నంబర్ 592లోని ఈ స్థలాన్ని 1978 ఆగస్టు 21న రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. తర్వాత కాలంలో నరసింహారెడ్డి కుటుంబీకులు తమకు ఉన్న మరో 50 సెంట్ల స్థలాన్ని మహర్షి ఆశ్రమానికి అమ్మడం జరిగింది. మొత్తం ఎకరా 65 సెంట్లలో ఆశ్రమాన్ని, పాఠశాలను నడిపేవారు. గత కొన్నేళ్లుగా ఆశ్రమ నిర్వహణ గురించి నిర్వాహకులు పట్టించుకోవడం వదిలేశారు. ఈ కారణంగా ఈ సంస్థలో ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. విలువైన ఈ స్థలాన్ని మాత్రం కాపాడుకుంటూ వచ్చారు.
కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి..
చుట్టూ జనావాసాల మధ్య ఉన్న ఈ స్థలం విలువ ప్రస్తుతం పెరిగింది. ఇక్కడ సెంటు స్థలం విలువ రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు పలుకుతోంది. సుమారు రూ.20 కోట్ల విలువైన ఈ స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కొనుగోలు చేయాలని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చారు. అధికార పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరులు ఈ స్థలాన్ని కారుచౌకగా కొనుగోలు చేశారు. ఇందులో ప్రజాపతి తనయుడు స్లీపింగ్ పార్టనర్‌గా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ఈ స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వివాదం కూడా చోటు చేసుకుంది. ఆశ్రమ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకుని మొత్తం స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసి తాజాగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
భవనాలు జేసీబీతో నేలమట్టం
గత పది రోజులుగా ఆశ్రమంలోని జ్ఞాన మందిరం, పాఠశాల భవనాలతోపాటు ఇతర నిర్మాణాలను జేసీబీతో తొలగించి నేలమట్టం చేశారు. దానంగా ఇచ్చిన ఈ స్థలంలో పాఠశాలను నిర్వహించాలని, ఆశ్రమాన్ని నెలకొల్పాలని ఈ స్థలంపై తనకు, తన వారసులకు ఎలాంటి హక్కు లేదని ఆనాడే నరసింహారెడ్డి రిజిస్ట్రేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. ఈ ప్రకారంగా దానంగా ఇచ్చిన భూములు, స్థలాలను అమ్ముకునే హక్కు కల్పిస్తే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది.
నాడు సమాజ హితం కోసం..
ప్రొద్దుటూరులోని ఎస్‌సీఎన్‌ఆర్ ప్రభుత్వ కళాశాలకు మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తండ్రి నాగిరెడ్డి పూర్వం పది ఎకరాలకుపైగా స్థలాన్ని దానంగా ఇచ్చారు. అలాగే ఎర్రగుంట్ల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు పూర్వం మాజీ ఎమ్మెల్యే పేర్ల శివారెడ్డి తండ్రి పేర్ల నాగిరెడ్డి 10 ఎకరాలకుపైగా స్థలం ఇచ్చారు. నాడు సమాజ శ్రేయస్సు కోసం ధనవంతులు భూములను విరాళంగా ఇచ్చే పరిస్థితి ఉండేది. నేడు అందుకు భిన్నంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సమాజ హితం కోసం ఇచ్చే స్థలాలను ఆక్రమిస్తున్నారు.
మహర్షి ఆశ్రమం భూమి హాంఫట్
నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు
భారీ విలువ ఉండగా.. కారు చౌకగా..
రియల్ ఎస్టేట్‌వ్యాపారం కోసం పన్నాగం

ఆశ్రమ స్థలంపై కన్ను

ఆశ్రమ స్థలంపై కన్ను