
దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో ఏప్రిల్ 30వ తేదీ వరకు సర్వీసులో ఉన్న ఒప్పంద అధ్యాపకులు 2025–26 విద్యా సంవత్సరానికి రెన్యూవల్స్ చేసుకోవాలని కడప జిల్లా ఐడి కళాశాల(ఆర్ట్స్ కళాశాల) ప్రిన్సిపాల్ జి.రవీంద్రనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. వారు పని చేస్తున్న కళాశాలల్లోని ప్రిన్సిపాల్‌లకు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రేపు పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
కడప ఎడ్యుకేషన్: కడప శివారులోని కేఎస్‌ఆర్‌ఎం కళాశాలలో 1996–2000 సంవత్సరాల మధ్య ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల సమ్మేళనం శనివారం నిర్వహించనున్నట్లు పూర్య విద్యార్థులు తెలిపారు. కళాశాల 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ అల్యుమినీ మీట్ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కాలేజ్ అభివృద్ధిపై చర్చ, సామూహిక భోజన కార్యక్రమాలు ఉంటాయన్నారు. పూర్వ విద్యార్థులు 8123417684కు వివరాల కోసం ఫోన్ చేయవచ్చునని తెలిపారు.
నాలుగు ఏఎంసీలకు
చైర్మన్ల నియామకం
సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లాతో పాటు వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని పలు మార్కెట్ యార్డ్ కమిటీలకు సర్కార్ చైర్మన్ లను నియమించింది.. మదనపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని జనసేన పార్టీకి కేటాయించగా బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించారు.. వైఎస్‌ఆర్ కడప జిల్లా బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా పి.విజయలక్ష్మి( బీజేపీ), అన్నమయ్య జిల్లా రాయచోటి మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా బోడిరెడ్డి రాంప్రసాద్ రెడ్డి (టీడీపీ), లక్కిరెడ్డిపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా ఎస్ ఎండి షఫీ, మదనపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా జంగాల శ్రీనివాస్(జనసేన)ను నియమించారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం పేర్లు ప్రకటించింది. అధికారికంగా ఆదేశాలు రావాల్సి ఉంది.
బాలిక హత్యపై
స్పందించిన కమిషన్
కడప కోటిరెడ్డి సర్కిల్: గండికోటలో హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని సంఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న వైష్ణవి ఇంటి నుంచి బయలుదేరి, ఆ తర్వాతకు హత్యకు గురైందని పత్రికల్లో వార్తలు ప్రచురితం కావడంతో కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఇంటర్ విద్యార్థిని చనిపోవడం బాధాకరమని, వారి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంది. ఎన్ని గంటలకు వెళ్లింది, ఎక్కడి నుంచి వెళ్లింది, సంఘటన జరగడానికి కారణాలు తదితరాలపై సమగ్ర విచారణ చేసి నివేదిక సమర్పించాలని జిల్లాలోని సంబంధిత అధికారులను కమిషన్ ఆదేశించింది.
తిరుపతి– చర్లపల్లి
మధ్య ప్రత్యేక రైలు
కడప కోటిరెడ్డి సర్కిల్: ఆగస్టులో తిరుపతి– చర్లపల్లి మధ్య మరో ప్రత్యేక రైలు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రతి ఆదివారం, సోమవారం ఈ రైలు రాకపోకలు సాగిస్తుందని కడప రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్ధన్ తెలిపారు. తిరుపతిలో ఆగస్టు 3, 10, 17, 24వ తేదీల్లో (ఆదివారం) 07481 రైలు 9.10 గంటలకు బయలుదేరుతుందని ఆయన పేర్కొన్నారు. రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, డోన్, కర్నూలు సిటీ, గద్వాల్, వనపర్తి రోడ్డు, మహబూబ్ నగర్, జడ్చర్ల, కాచిగూడ, మల్కాజ్‌గిరి మీదుగా చర్లపల్లికి వెళ్తుందన్నారు. ప్రతి సోమవారం చర్లపల్లిలో రాత్రి 7.20 గంటలకు బయలుదేరి.. మంగళవారం ఉదయం 9.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుందన్నారు.
కేసీ కెనాల్‌కు నీటి విడుదల
వల్లూరు: మండలంలోని ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద పెన్నానది నుంచి కేసీ కెనాల్‌కు గురువారం నీటిని విడుదల చేశారు. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి పూజలు జరిపి అనంతరం గేట్లు తెరిచి కాలువకు నీటిని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ చిన్న పుల్లయ్య, ఏఈ గంగిరెడ్డి, కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మెన్ వెంకట సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.