
రైతులపై ఇంత నిర్లక్ష్యమా!
పులివెందుల: శ్రీశైలం, పీబీసీ, సీబీఆర్, గండికోట ప్రాజెక్టులపై ఇరిగేషన్ శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని అంబకపల్లె రోడ్డులోని ఇరిగేషన్ డీఈ కార్యాలయానికొచ్చి అధికారులతో మాట్లాడారు. ప్రాజెక్టులలో నీరు పుష్కలంగా ఉన్నా రైతులకు సాగునీరు ఎందుకందించలేదని ప్రశ్నించారు. గత ఐదారేళ్లలో ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదని అధికారులపై మండిపడ్డారు. దీనికి అధికారులు ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేయడం లేదని సమాధానమిచ్చారు. దీనికి ఎంపీ స్పందిస్తూ గతంలో మోటార్లు పనిచేయలేదన్నారు.., ఇప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేయడంలేదని కుంటి సాకులు చెబుతున్నారా అంటూ మండిపడ్డారు. రూ.5లక్షల నుంచి రూ.10లక్షలు విలువ చేసే మరమ్మతులు కూడా చేయకుంటే ఎలా అని ప్రశ్నించారు. దీనివల్ల రైతులకు కోట్లాది రూపాయలు నష్టపోతారన్నారు. ఇలాంటి చిన్నపాటి రిపేర్లకు కూడా ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. వెంటనే ట్రాన్స్‌ఫార్మర్లను రిపేరు చేయించి ఎర్రబల్లె చెరువు, భూమయ్యగారిపల్లె చెరువులకు నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
● అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గండికోట, సీబీఆర్, పైడిపాలెం ప్రాజెక్టులలో నీరు పుష్కలంగా ఉన్నా ఆయకట్టు చెరువులకు నీరు విడుదల చేయడం లేదని ధ్వజమెత్తారు. లింగాల చెరువు, ఎరబ్రల్లె చెరువుకు సత్వరమే నీటిని విడుదల చేయాలని అధికారులను కోరామన్నారు. ఎరబ్రల్లి చెరువును నీటితో నింపితే పది గ్రామాలకు లబ్ధి చేకూరుతుందని, ఈ విషయం గురించి రెండు నెలల నుంచి విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. మోటర్లు కాలిపోయాయని చెబుతున్నారని, తాము మోటార్లు రిపేరు చేయిస్తామని చెబితే ఒప్పుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వమే చేయాలి, కూటమి నాయకులే చేయాలంటున్నారు.. వారు చేయరు చేసేవారిని చేయనివ్వరని విమర్శించారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా పులివెందులను హార్టికల్చర్ హబ్‌గా చేస్తానని గొప్పగా చెబుతుంటారని, కానీ పులివెందుల రైతులకు నీరు ఇవ్వడానికి మీనమేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యాన పంటల సాగుపైనే ఆధారపడిన నియోజకవర్గానికి నీరు ఇవ్వకపోతే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రతిరోజు కొత్తపల్లె, నల్లపు రెడ్డి పల్లె గ్రామాల్లో కొత్త బోర్లు వేయడం మొదలుపెట్టారని, రోజుకు 15 నుంచి 20 కొత్త బోర్లు వేస్తున్నారని, ప్రతిరోజు రైతులకు రూ.40లక్షల దాకా ఖర్చు అవుతోందన్నారు. ఇప్పటికై నా నిద్ర మేల్కొని సత్వరమే వాటర్ మేనేజ్మెంట్ పై శ్రద్ధ పెట్టాలని, సత్వరమే ఎరబ్రల్లె చెరువు, భూమయ్యగారిపల్లె చెరువులను నీటితో నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్, పట్టణ కన్వీనర్ హాలు గంగాధరరెడ్డి, మండల నాయకులు సాంబశివారెడ్డి, బయపురెడ్డి, బాబురెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టులలో నీరు ఉన్నా రైతులకు ఎందుకివ్వడం లేదు
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధ్వజం