
గ్రామస్థాయికి జన్ సురక్ష పథకాలు
కడప సెవెన్‌రోడ్స్: జన సురక్ష పథకాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని బోర్డు రూమ్ కాన్ఫరెన్స్ హాల్లో జన్ సురక్ష పథకాలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా ఈ నెల నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కు సంబంధించి సంబంధిత అధికారులతో తన చాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ అదితి సింగ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్ సురక్ష పథకాలైన ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్లి నమోదు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలని ఎల్‌డీఎంను ఆదేశించారు. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా బ్యాంకు ఖాతాలు లేని కుటుంబాలను గుర్తించి, వారిచే బ్యాంకు ఖాతాలను తెరిపించాలని ఆదేశించారు. జన్ ధన్ బ్యాంకు ఖాతాల ఈ కేవైసీ చేయనివారిని గుర్తించి ఈ కేవైసీ అప్డేషన్ ప్రక్రియను వేగంగా చేయాలన్నారు. డీఆర్‌ఓ విశ్వేశ్వర నాయుడు,లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజరు జనార్ధన్, నాబార్డ్ ఏజిఎం విజయ విహారి, డిఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, జెడ్పి డిప్యూటీ సీఈఓ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
పేదరికాన్ని రూపుమాపేందుకే పీ4
రాష్ట్రంలోని పేదరికాన్ని రూపు మాపడమే లక్ష్యంగా, ప్రభుత్వం పీ4 విధానాన్ని రూపొందించిందని జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితిసింగ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటికే బంగారు కుటుంబాలను ప్రాథమికంగా సర్వే ద్వారా గుర్తించామన్నారు. తుది జాబితాను తయారు చేసేందుకు గ్రామ వార్డు సభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామసభల నిర్వహణకు 17వ తేదీ లోపు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి ఈ నెల 18 నుండి ఆగస్టు 5వ తేదీ వరకు సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేఎంసి కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప, జమ్మలమడుగు, బద్వేలు ఆర్డీవోలు , రాష్ట్ర సమగ్ర టీమ్ ప్రతినిధి సాయి సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.
● జులై నుంచి సెప్టెంబర్ 30 వరకు స్పెషల్ క్యాంపెయిన్
● ఇన్‌చార్జి కలెక్టర్ అదితి సింగ్