
బ్రిటీష్ పాలన కంటే ఘోరం
కడప కార్పొరేషన్ : రాష్ట్రంలో బ్రిటీషు పాలన కంటే దారుణమైన పాలన కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయినా మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. రూ.1.75 లక్షల కోట్లు అప్పులు చేసినా ప్రజా సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలని, ప్రస్తుతం రాష్ట్రం కరువుతో అల్లాడుతోందన్నారు. పంటలు అంతంత మాత్రంగానే పండుతున్నాయని, ఆ పండిన పంటలకు కూడా గిట్టుబాటు ధర లేదన్నారు. పంటలు కొని రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం ఒక్క కేజీ కూడా కొనలేదన్నారు. కేంద్రంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.20 వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, మొదటి ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రైతులు తెచ్చిన అప్పులకు సున్నావడ్డీ అసలే ఇవ్వలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి దశలోనూ రైతులకు సాయమందించారని, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రూ.7450 కోట్లు వారి కోసమే వినియోగించారన్నారు. కూటమి ప్రభుత్వం రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి, దాని ఊసే ఎత్తడం లేదన్నారు. మొన్న ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులను పరామర్శించడానికి వైఎస్ జగన్ వెళితే రైతులు లక్షలాది మంది తరలి వచ్చారని, నిన్న చిత్తూరులో 25 చెక్‌పోస్టులు పెట్టి అడ్డుకున్నా మామిడి రైతులు వేలాది మంది హాజరయ్యారన్నారు. చిత్తూరు జిల్లాలో 90 వేల మంది రైతులు రెండున్నర లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేశారని, 7 లక్షల టన్నుల మామిడి పంట వచ్చిందన్నారు. మామిడిని రూ.2లకు కొనేవారు లేరని, అందుకే మామిడి రైతులు తమ బాధలు చెప్పుకొనేందుకు వైఎస్ జగన్ వద్దకు వచ్చారన్నారు. హెలీప్యాడ్ వద్ద 30 మంది కంటే ఎక్కువ ఉండకూడదు, మార్కెట్ యార్డులో 500 మంది కంటే ఎక్కువ ఉండకూడదని వేలాది మంది పోలీసులను మోహరించి అన్ని విధాలుగా నియంత్రించారన్నారు. మాజీ మంత్రులకు సైతం నోటీసులిచ్చి రౌడీ షీట్లు తెరుస్తామని బెదిరించారన్నారు. ఇది ప్రజాస్వామ్యమో, నియంతృత్వమో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు బాధల్లో ఉన్నారని వారిని పరామర్శించేందుకు ఎవరు వచ్చినా స్పందన ఇలాగే ఉంటుందన్నారు. చంద్రబాబు రైతులను పరామర్శించరని, ఎవరైనా పరామర్శిస్తే ఓర్వలేరని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం తీరు మార్చుకొని ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి కనబరచాలని, లేనిపక్షంలో తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ పులి సునీల్, రాష్ట్ర మున్సిపల్ విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీరంజన్‌రెడ్డి, జిలా ఆర్‌టీఐ విభాగం జిల్లా అధ్యక్షుడు రామక్రిష్ణారెడ్డి, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు షఫీవుల్లా, వి.నాగేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ జగన్ పర్యటనలకు
ప్రజలు బ్రహ్మరథం
25 చెక్‌పోస్టులు పెట్టి
రైతులను అడ్డుకున్నా.. తరలివచ్చారు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాథ్‌రెడ్డి