ఆర్‌బీకేల ద్వారా ఎరువులు సరఫరా చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్‌బీకేల ద్వారా ఎరువులు సరఫరా చేయాలి

Jul 18 2025 5:16 AM | Updated on Jul 18 2025 5:16 AM

ఆర్‌బీకేల ద్వారా ఎరువులు సరఫరా చేయాలి

ఆర్‌బీకేల ద్వారా ఎరువులు సరఫరా చేయాలి

కడప సెవెన్‌ రోడ్స్‌ : ఖరీఫ్‌ రైతులకు అవసరమైన ఎరువులను ఆర్‌బీకేల ద్వారా బస్తా రూ.267కే సరఫరా చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడును గురువారం ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ కెసీ కెనాల్‌కు సాగునీరు విడుదల చేయడంతో వరి, ఉల్లి, పత్తి, ఉద్యాన పంటలు సాగు చేసిన రైతులు ఎరువులు లభించక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బయట మార్కెట్‌లో బస్తా రూ.350 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. ఆర్‌బీకేలో సమాధానం చెప్పే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు కావస్తున్నప్పటికీ రైతులకు ఏ ఒక్క సాయం చేయలేదని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రైతు భరోసా కింద రూ.13500 ఇచ్చారన్నాఉ. తాము అధికారంలోకి వస్తే పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు చేసిన వాగ్ధానం ఇప్పటికీ నెరవేరలేదని విమర్శించారు. వరి, మినుము తదితర పంటలకు కనీస మద్దతు ధర లేక రైతు అవస్థపడుతున్నారని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఖరీఫ్‌ పంటలకు నష్టం జరిగితే పరిహారం అందించి అదుకున్నామని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సున్నా వడ్డీ పథకాన్ని కూటమి ప్రభుత్వం పునరుద్ధరించాలని కోరారు.

ఇన్‌చార్జి కలెక్టర్‌ తీరుపై ఆగ్రహం

రైతు సమస్యలపై వినతిపత్రం సమర్పించాలని ముందస్తుగా ఇన్‌చార్జి కలెక్టర్‌ అదితిసింగ్‌ను అపాయింట్‌మెంట్‌ కోరగా.. సాయంత్రం 5 గంటలకు వచ్చి కలవాలని ఆమె క్యాంప్‌ క్లర్క్‌ ద్వారా చెప్పారని రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. తాము కలెక్టరేట్‌కు వస్తే ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఆమె వెళ్లిపోవడం భాద్యతారాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు వస్తే ఎవరూ పట్టించుకోవద్దని ప్రభుత్వం మౌఖిక అదేశాలు జారీ చేసిందా అంటూ ఆయన ప్రశ్నించారు. అధికారులు తమ వైఖరి మార్చుకొని అందరికీ అందుబాటులో ఉండాలని హితవు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరుప్రసాద్‌రెడ్డి, నగర అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పులి సునీల్‌కుమార్‌, శ్రీరంజన్‌రెడ్డి, చెన్నూరు ఎంపీపీ చీర్లసురేష్‌ యాదవ్‌, సీహెచ్‌ వినోద్‌కుమార్‌, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షఫీ, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షఫీ, ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి త్యాగరాజు, యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

పి.రవీంధ్రనాథ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement