జమ్మలమడుగు/మైలవరం : సోలార్ ప్యానెల్ ముప్పు రైతులకు సంకటంగా మారుతోంది. భూముల యజమానుల అనుమతి లేకుండానే పొలాల్లో ప్యానెల్ ఏర్పాటు చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ప్రత్యేక బృందాలతో బెదిరింపులకు దిగుతున్నారు. ఏదో ఒక లింకు పెట్టి భూములను స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. పెద్దముడియం మండలం కల్వటాల గ్రామంలో సెల్(ఎస్‌ఏఈఎల్) కంపెనీ సోలార్ ప్రాజెక్టు చేపడుతోంది. తమ సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసేందుకు నిబంధనలకు పాతర వేస్తోంది. రైతులు తమ పొలాలు ఇవ్వకున్నా.. ఏదో లింకు పెట్టి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. స్థానిక రైతులపై రోజు రోజుకూ బెదిరింపుల పర్వం పెరిగిపోతోంది. ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి పొలాల యజమానులపై దౌర్జన్యానికి దిగుతున్నారు. విచిత్రమేమిటంటే గతంలో చాలామంది రైతులను తప్పుదోవపట్టించి భూములను లీజుల రూపంలోనూ, కొనుగోలు రూపంలో తీసుకున్న సంస్ధ వ్యక్తులు ఇపుడు కొత్త కోణాన్ని తీసుకువస్తున్నారు. భార్య పేరు మీద భూములుంటే భర్తలను మభ్యపెట్టి ఇంట్లో వారికి సమాచారం లేకుండానే ఒప్పంద పత్రం రాయించుకుంటున్నారు.
భార్యపేరిట భూములున్నా
భర్త పేరుతో ఒప్పందం
ఇచ్చి తీరాలంటూ సోలార్ యాజమాన్యం బెదిరింపులు