
నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి
కడప ఎడ్యుకేషన్: గండికోటలో జరిగిన బాలిక హత్యపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని ఆర్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డీఎం ఓబులేసు యాదవ్, గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి వేదిక సీమ కన్వీనర్ ఆంజనేయులు, బీఎస్‌పీ జిల్లా అధ్యక్షులు సగిలి గుర్రప్ప డిమాండ్ చేశారు. బాలిక మృతికి సంతాపంగా ఆర్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం కడప నగరంలోని అంబేడ్కర్ సర్కిల్‌లో కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జిల్లా గండికోట పర్యాటక కేంద్రంలో ఐదు రోజుల క్రితం ఇంటర్ చదువుతున్న విద్యార్థిని హత్యకు గురైందన్నారు. ఘటన జరిగి ఐదు రోజులు గడిచినా వాస్తవాలను ప్రకటించక పోవడంలో రాజకీయ జోక్యం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఘటనలు చోటుచేసుకున్నాయని మండిపడ్డారు. హోంమంత్రి ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ఎస్సీ ఎస్టీ ఉమెన్ రైట్స్ కన్వీనర్ జేవీ రమణ, సీపీఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల ఓబయ్య, ఎంఆర్‌పీ జాతీయ అధ్యక్షులు సంగటి మనోహర్, ఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు యస్.రామాంజనేయులు, యస్.సుబ్బరాజు, హేతువాద సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఆల్ ఇండియా బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు జగన్ నాయక్, పీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.నాగరాజు, ఐసా జిల్లా కార్యదర్శి ప్రసన్న, ఎస్సీ యాదవ్, లోకసత్తా పార్టీ అధ్యక్షులు దేవర కృష్ణ, రసూల్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేదిక రాష్ట్ర కన్వీనర్ నాగరాజు పాల్గొన్నారు.