
బద్వేలులో భారీ వర్షం
లోతట్టు ప్రాంతాలు జలమయం
బద్వేలు అర్బన్ : బద్వేలులో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి మురుగునీరు రోడ్లపైకి చేరింది. పట్టణంలోని మైదుకూరు రోడ్డు, మెయిన్‌బజార్, ఆంజనేయనగర్, రామాంజనేయనగర్, శాస్త్రినగర్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల్లో రహదారుల పైకి మురుగునీరు చేరింది. మైదుకూరు రోడ్డులో భారీగా వర్షపునీరు నిలిచి ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ గ్యారేజీలోకి మోకాలిలోతు నీరు చేరడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గ్యారేజీలోకి చేరిన నీటిని ఫైరింజన్ సహాయంతో బయటికి పంపించారు. మహబూబ్‌నగర్, మెయిన్‌బజార్, త్యాగరాజకాలనీ చుట్టూ భారీగా వర్షపు నీరు చేరింది. ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీల్లో చెత్త నిల్వలు పేరుకుపోవడంతో మురుగునీరంతా రోడ్లపైకి చేరింది. మున్సిపల్ కమిషనర్ వి.వి.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో లోతట్టు ప్రాంతాల్లో పూడికతీత పనులు చేపట్టి నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టారు.