పొగాకు కొనుగోలుకు ముందుకొచ్చిన జీపీఐ కంపెనీ
బి.కోడూరు : మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పొగాకు కొనుగోలుకు ఎట్టకేలకు జీీపీఐ కంపెనీ ముందుకు వచ్చింది. మండల రైతుల నుంచి ఒత్తిడి అధికం కావడంతో సోమవారం నుంచి పొగాకును కొనుగోలుకు కంపెనీ సిద్ధమైంది. జీపీఐ కంపెనీ వారు పొగాకు కొనుగోలుకు ముందుకు రావడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మందు పిచికారీతో
పంట నష్టం
ఖాజీపేట : పంటకు తెగులు సోకిందని మందు పిచికారీ చేస్తే చేతికి వచ్చిన పంట పూర్తిగా ఎండిపోయిందని బాధిత రైతు లబోదిబోమంటున్నాడు. ఖాజీపేట మండలం కొత్త ఏటూరు గ్రామానికి చెందిన వీరభద్ర అనే రైతుకు రెండు ఎకరాల పొలం ఉంది. పొలంలో పచ్చపెసర సాగు చేశాడు. పంటకు తెగులు సోకడంతో ప్రొద్దుటూరుకు చెందిన ఒక దుకాణంలో మందు కొనుగోలు చేశాడు. మందు పిచికారీ చేశాక సాయంత్రం కల్లా పంట పూర్తిగా ఎండిపోయింది. పంటకు సక్రమమైన మందు ఇచ్చి ఉంటే ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చేదని రైతు తెలిపాడు. ఎకరాకు రూ.50వేలు ఖర్చయిందని, కేవలం మందు పిచికారీ కారణంగా పంట పూర్తిగా నష్టపోయానని వాపోయాడు. అధికారులు తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.


