యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేటలో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ సోమవారం గ్రామ పంచాయతీ నిర్ణయంతీసుకుంది. ఈ మేరకు గ్రామ సభలో పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. మద్యం సేవించడం వల్ల పలు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కొందరు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామ ప్రజల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్‌ఆరె రమేష్ గౌడ్ తెలిపారు. ఇక నుంచి గ్రామంలో ఎవరు కూడా మద్యం అమ్మవద్దని, అలా అమ్మితే రూ.20000 జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సోకం అనిత మల్లేష్, పంచాయతీ సెక్రటరీ రమేష్, వార్డు సభ్యులు గాజుల స్వర్ణలత, మారబోయిన భారతమ్మ, గాజుల శ్రీకాంత్, అంగడి మల్లేష్, గాజుల రాజు, బరిగె రాజు, అంగడి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


