దసరా తర్వాత పత్తి కొనుగోళ్లకు సన్నాహాలు
భువనగిరి: రైతులకు కనీస మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కసరత్తు వేగవంతం చేసింది. దసరా పండుగ తర్వాత పత్తి కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి జిన్నింగ్ మిల్లుల వారీగా కేటగిరీల విధానాన్ని తొలగించి, అన్ని మిల్లుల్లోనూ ఒకేసారి కేంద్రాలను ప్రారంభిస్తుండటం రైతులకు ఎంతో ఊరటనివ్వనుంది.
జిన్నింగ్ మిల్లులే కేంద్రాలుగా..
ఈ ఏడాది జిల్లాలో రైతులు 1.12 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ప్రస్తుత సీజన్‌లో పత్తి పంట సాగును దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా మొత్తం 6.75 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.దళారుల బెడద లేకుండా నేరుగా ప్రభుత్వ మద్దతు ధరను అందించేందుకు జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లోని జిన్నింగ్ మిల్లులను సీసీఐ అధికారులు కొనుగోలు కేంద్రాలుగా మారుస్తున్నారు. ఈక్రమంలో ఆలేరులో రెండు, కొండమడుగులో ఒకటి, మోత్కూరులో ఏడు, వలిగొండలో రెండు కేంద్రాలు ఇలా మొత్తంగా 12 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరగనున్నాయి.
రైతులు ఇబ్బందులు పడుకుండా..
గత ఏడాది కాటన్ కార్పొరేషన్ ఇఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోలు కేంద్రాలను ఎల్–1, ఎల్–2, ఎల్–3గా వర్గీకరించడం వల్ల కొన్ని మిల్లులకే ప్రాధాన్యం దక్కి మిల్లర్లు, రైతులు ఇబ్బందులు పడ్డారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈసారి కేటగిరీల విధానాన్ని పూర్తిగా తొలగించారు. అన్ని జిన్నింగ్ మిల్లుల్లోనూ ఒకేసారి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానుండటంతో రైతులకు రవాణా భారం, దూరభారం తగ్గనుంది.
తగ్గిన పత్తి సాగు
ఎల్‌నినో వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు ఈసారి పత్తి సాగుపై తీవ్ర ప్రభావం చూపాయి. గత ఏడాది (2025–26) జిల్లాలో 1.34 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈసారి అది 1.12 లక్షల ఎకరాలకు పడిపోయింది. అంతేకాక, వర్షాలు సరిగా కురవకపోవడంతో రైతులు రెండు మూడు సార్లు విత్తనాలు వేయాల్సి వచ్చి తీవ్ర పెట్టుబడి నష్టాలను చవిచూశారు. గతేడాది ఎకరాకు 6 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా, ప్రస్తుత పరిస్థితిని బట్టి దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
సీసీఐ కేంద్రాలు
ఆలేరు 2
కొండమడుగు 1
మోత్కూరు 7
వలిగొండ 2
జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు పూర్తి చేస్తున్నాం. రైతులు ఎవరూ దళారులను ఆశ్రయించి నష్టపోవద్దు. ప్రభుత్వ కేంద్రాల ద్వారానే పత్తిని విక్రయించి మద్దతు ధర పొందాలి.
– సారంగపాణి,
మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి
ఫ జిల్లా వ్యాప్తంగా 1.12 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
ఫ 6.75 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా


